మరో చోట పెచ్చులూడిన పాఠశాల పైకప్పు | - | Sakshi
Sakshi News home page

మరో చోట పెచ్చులూడిన పాఠశాల పైకప్పు

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

కలబుర్గి జిల్లా ఆళంద తాలూకాలో ఘటన

రాయచూరు రూరల్‌: ప్రభుత్వ కళాశాల పైకప్పు కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలైన ఘటన కలబుర్గిలో జరిగిన మూడు రోజులు గడవక ముందే మరోసారి జిల్లాలో పాఠశాల పైకప్పు ఊడిన ఘటన కలబుర్గి ఆళంద తాలూకా సంగొళిగిలో చోటు చేసుకుంది. ఆదివారం ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో ఉన్నఫళంగా సిమెంట్‌ కాంక్రీట్‌తో కూడిన పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆదివారం సెలవు కావడంతో విద్యార్థులకు గండం తప్పింది. గదుల నిర్మాణం నాసిరకంగా చేసినందువల్లే పైకప్పు పెచ్చులు ఊడిపతున్నట్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందనే ఆరోపణలున్నాయి.

బాలికపై అత్యాచారం..

నిందితుడు అరెస్ట్‌

హుబ్లీ: 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఇక్కడి పాత హుబ్లీ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు బాలికను బలవంతంగా ఆటోలో కూర్చొబెట్టుకొని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక ఈ విషయాన్ని ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గుర్తు తెలియని వ్యక్తి శవం

మరో ఘటనలో ఓ వ్యక్తి శవం లభించింది. పాత హుబ్లీ గోకులధామ ఖాళీ స్థలంలో వ్యక్తి శవం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. సుమారు 50, 55 ఏళ్ల వయస్సుగల వ్యక్తి శవం చెత్తచెదారం, ముళ్ల కంపల మధ్య దొరికింది. ఇతడి ఆచూకీ తెలిసిన వారు పాత హుబ్లీ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసులు ఈ వ్యక్తి శవం పూర్వాపరాలపై దర్యాప్తు చేపట్టారు.

యోగాతో ఆరోగ్య రక్షణ

రాయచూరు రూరల్‌: మనిషి ఆరోగ్య రక్షణకు యోగాపై శ్రద్ధ అవసరమని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. సోమవారం ప్రజాిపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన యోగా శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా జరిగే మూడు రోజుల శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. కార్యక్రమంలో శారద, తిమ్మప్ప, అయ్యప్ప, డాక్టర్‌ నవీన్‌, పూజాలున్నారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి దుర్మరణం

రాయచూరు రూరల్‌: కారు లారీని ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన ఆదివారం సాయంత్రం తెలంగాణలోని గుడేబల్లూరు వద్ద జరిగింది. ప్రమాదంలో జ్యోతి కాలనీలో నివాసముంటున్న శేఖరప్ప గౌడ(68) మరణించారు. కలబుర్గి శరణ బసవేశ్వర దేవస్థానాన్ని దర్శించుకుని తిరిగి రాయచూరుకు వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సమస్యలు తీర్చాలని ధర్నా

రాయచూరు రూరల్‌: దేశానికి బంగారాన్ని ఉత్పత్తి చేసే హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. సోమవారం హట్టి బంగారు గనుల కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నానుద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి శఫీ మాట్లాడారు. వైద్యకీయ అనర్హత పథకాన్ని రద్దు పరచాలన్నారు. నూతన వేతనాల ఒప్పందం, ఆహార కిట్ల పంపిణీ, హెచ్‌ఆర్‌ఏ, ఎక్స్‌గ్రేషియా, 2025–26వ సంవత్సరానికి బకాయిలున్న వేతనాలు చెల్లించాలని, రిటైర్డ్‌ పథకాన్ని జారీ చేయాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ద్వి చక్రవాహనాలతో ర్యాలీ చేపట్టారు. అరగంటసేపు రాస్తారోకో చేశారు. వెంకోబ గౌస్‌, జమదగ్ని, రమేష్‌, బాబు, హనుమంతు, మునీర్‌, సాగర్‌, సంగయ్య రాజేశ్వరి, వెంకటేష్‌లున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement