హుబ్లీ: కొప్పళ జిల్లాలో కుతూహలకరమైన, చమత్కారం కలిగించే ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారి పొలంలో శివలింగం లభించింది. అందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ శివలింగానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌కు ఓ అపూర్వమైన, అరుదైన అవినాభావ సంబంధం ఉందన్న విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. కలలో కనిపించినట్లుగా పొలంలో శివలింగం లభించడంతో కొప్పళ జిల్లా ప్రజల క్షేమం కోసం ఈ అరుదైన లింగాన్ని సీఎం డీకే.శివకుమార్‌కు అప్పగించాలని సదరు వ్యాపారి సిద్ధమవుతున్నారు. అంతేగాక శివలింగం ప్రత్యక్షం అయిన స్థలంలో నాగుపాము కూడా ప్రత్యక్షం కావడం గమనార్హం. కలలో కనిపించిన మరుసటి రోజే కొప్పళ తాలూకా బసాపుర వద్ద ఉన్న వ్యాపారి వితీన్‌కుమార్‌కు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో తనకు దొరికే శివలింగాన్ని పరమ శివభక్తుడైన డీకే.శివకుమార్‌కు అప్పగించాలనే సదుద్దేశం కనిపించిందని చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కల వచ్చిన మరుసటి రోజు పొలంలో పని చేస్తున్న జడియప్ప అనే రైతుకు ఈ పవిత్ర శివలింగం ప్రత్యక్షం అయింది.
శివలింగాన్ని సీఎంకు అప్పగించే యోచన
అప్పటి నుంచి ఆ శివలింగాన్ని వ్యాపారి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. కలలో చెప్పినట్లుగానే వ్యాపారి వితీన్‌కుమార్ ఆ శివలింగాన్ని డీకే.శివకుమార్ ఇవ్వడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ విషయంలో భక్తి కంటే కొప్పళ జిల్లా ప్రజలు, రైతుల శ్రేయస్సు ఉందని చెబుతున్నారు. బసాపుర ప్రాంతంలో బల్డోటా ఫ్యాక్టరీ విస్తరణ పనులను అడ్డుకోవాలన్నది జిల్లా ప్రజల డిమాండ్. ఈ నేపథ్యంలో పర్యావరణం, రైతుల శ్రేయస్సు కోసం శివలింగాన్ని అడ్డుగా పెట్టుకొని సీఎంకు విజ్ఞప్తి చేయడానికి వితీన్‌కుమార్ సిద్ధమవుతున్నారు. మొత్తానికి కొత్త సీఎం చేతుల్లోకి చర్చనీయాంశమైన శివలింగం త్వరలో చేరనుందని, ఫలితంగా పర్యావరణం నుంచి కొప్పళ జిల్లా ప్రజలకు కాస్తయినా ఉపశమనం లభిస్తుందని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు.
అదే చోట కనిపించిన నాగుపాము
కొప్పళ జిల్లాలో కుతూహలకర ఘటన


