కుక్కను తప్పించబోయి.. పోలీస్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కుక్కను తప్పించబోయి.. పోలీస్‌ దుర్మరణం

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

మైసూరు: వీధి కుక్క పోలీసు ప్రాణాలను బలిగొంది. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట పట్టణ శివార్లలో రోడ్డుపై ఉన్న కుక్కను ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో బైక్‌ కిందపడిపోగా కానిస్టేబుల్‌ మృతి చెందాడు. వివరాలు.. కానిస్టేబుల్‌ గణేష్‌ (31) స్వస్థలం నంజనగూడు తాలూకాలోని సిద్దయ్యనహుండి కాగా, గుండ్లుపేట పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. సిద్దయ్యనహుండి నుంచి గుండ్లుపేటకు డ్యూటీకి బైక్‌లో వెళ్తున్నాడు. గుండ్లుపేట పట్టణ శివార్లలో ఒక కుక్కను ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలో కిందపడి స్పహ కోల్పోయాడు. స్థానికులు అతడిని మైసూరులోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. కానీ కొంతసేపటికే మరణించాడు.

ఆరోగ్య యోగం

మైసూరు: మైసూరులో యోగా ఇప్పుడు చాలా ప్రసిద్ధి చెందిందని గణపతి సచ్చిదానంద ఆశ్రమం దత్త విజయానంద తీర్థ స్వామి అన్నారు. త్వరలో రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాల సన్నాహాల్లో ఊటీ రోడ్డులో ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఆదివారం యోగా సాధనను నిర్వహించారు. ఈసారి యోగా దినోత్సవం రాష్ట్ర స్థాయిలో విజయవంతంగా జరగాలి, కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగా సాధనలో పాల్గొనాలని అన్నారు. సామూహిక యోగాభ్యాసం అందరి మధ్య సత్సంబంధాలను వృద్ధి చేస్తుందన్నారు. వయోభేదం లేకుండా ఆరోగ్యం, శారీరక చురుకుదనం కోసం ప్రతి ఒక్కరూ యోగాను అనుసరించాలని తెలిపారు. ఈ సందర్భంగా వందలాది మంది యోగాసనాలను ఆచరించారు.

వేకువనే ప్రమాదం

చింతామణి వద్ద లారీని ఏపీఎస్‌

ఆర్టీసీ బస్సు ఢీ

10 మందికి గాయాలు

చింతామణి: రోడ్డు పక్కన టైర్‌ పంక్చరై నిలిపి ఉన్న లారీని నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపోకు చెందిన ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున బెంగళూరుకు వెళ్తున్న బస్సుకు కర్ణాటకలో చింతామణి పట్టణం వద్ద మాడికెరె క్రాస్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 23 మంది ప్రయాణికులతో బస్సు బెంగళూరుకు వెళ్తోంది. అయితే డ్రైవర్‌ నిద్రమత్తుకు గురికావడంతో నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. పెద్ద శబ్ధం, కుదుపు రావడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం ఘోరం జరిగిందోనని ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్‌కు చిన్నపాటి గాయాలు తగిలాయి. ముగ్గురికి తీవ్రంగా, ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బెంగళూరు కెఆర్‌ పురంవాసి చెన్నకేశవ (45), నెల్లూరువాసి యాబు (42), నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలవాసి సునీల్‌ (29) అనేవారికి తీవ్రగాయాలయ్యాయి. చెన్నకేశవ, యాబు పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలించారు. సునీల్‌ చింతామణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రయాణికులను అదే మార్గంలో వెళ్తున్న కడప ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు పంపించారు. చింతామణి రూరల్‌ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement