శ్రీశంకరులే స్ఫూర్తిప్రదాత | - | Sakshi
Sakshi News home page

శ్రీశంకరులే స్ఫూర్తిప్రదాత

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

మైసూరు: శంకరాచార్యులు ఒక దైవ స్వరూపులు, ఆయన హిందూమతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు, అని ఎమ్మెల్సీ సి.ఎన్‌. మంజగౌడ అన్నారు. శ్రీ శంకరాచార్యుల జయంతిని ఆదివారం సందర్భంగా కర్ణాటక సేనా ఆధ్వర్యంలో నగరంలోని శృంగేరి శ్రీ శంకర మఠంలో ఘనంగా నిర్వహించారు. శంకరాచార్యులు హిందూమతానికి పునరుజ్జీవం పోసిన ఆచార్యులని అన్నారు. ఆయన చాలా చిన్న వయసులోనే దేశమంతటా పర్యటించారు. నేటి విద్యార్థులు ఆయనలాగే మేధావులైన తత్వవేత్తలుగా ఎదగాలి. వారు బాగా చదువుకుని, పురోగమించాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభావంత విద్యార్థులను సన్మానించారు. పెద్దసంఖ్యలో నగర ప్రముఖులు పాల్గొన్నారు.

పిడుగు పడి రైతు బలి

మైసూరు: జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా, సంగరశెట్టహళ్లి గ్రామ శివార్లలో పిడుగుపాటుకు గురై ఒక రైతు మరణించాడు. ఎస్‌.టి.ఆనంద్‌ (60), పొలంలో పొగాకు పంటకు నీరు పెడుతుండగా, ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. ఆయన ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు. వెంటనే పెద్ద శబ్ధంతో చెట్టు మీద పిడుగు పడడంతో ఆనంద్‌ స్పృహ తప్పి పడిపోయాడు. గ్రామస్తులు అతడిని కె.ఆర్‌. నగర్‌లోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడు. ఆనంద్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు.

శివమొగ్గలో రౌడీపై బుల్లెట్‌

శివమొగ్గ: రౌడీషీటర్‌ నరసింహ హత్య కేసులో నిందితునిపై పోలీసులు కాల్పులు జరిపారు. హనుమంత్‌ అలియాస్‌ మధు (27), రౌడీషీటర్‌ నరసింహ హత్య కేసులో నిందితుడు. ఇటీవల అరెస్టు చేశారు, ఆదివారం తెల్లవారుజామున ఇన్‌స్పెక్టర్‌ హరీష్‌ పాటిల్‌ నేతృత్వంలో పోలీసులు శివమొగ్గ శివార్లలోని సుబ్బయ్య మెడికల్‌ కాలేజీ వెనుక ఉన్న డబుల్‌ రోడ్‌లోని హత్యాస్థలి పరిశీలనకు తీసుకువచ్చారు. ఈ సమయంలో అతడు బేడీలతో పోలీసులపై దాడి చేసి పరుగులు తీశాడు. దీంతో సీఐ కాల్పులు జరపగా మధు కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే పట్టుకుని ఆస్పత్రిలో చేర్చారు. భద్రావతి, శివమొగ్గ ప్రాంతాల్లో నేరాలు పెరగడంతో కఠిన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement