హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి గ్రామంలో వీధి కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. హగరిబొమ్మనహళ్లికి చెందిన రాజప్ప గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి పొలంలో ఏర్పాటు చేసిన కంచెలోకి గొర్రెలను తోలి, అక్కడే నిద్రించాడు. అయితే అర్ధరాత్రి తరువాత వీధి కుక్కలు కంచెలోకి చొరబడ్డాయి. గొర్రెలపై దాడి చేయడంతో సుమారు 30 వరకూ మృతి చెందాయి. కష్టపడి పెంచిన గొర్రెలు మృతి చెందడంతో రూ.లక్షల్లో నష్టం వాటిలినట్లు రాజప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. తగిన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరాడు. వీధి కుక్కలను దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
అదృశ్యం కేసుల ఛేదింపు
బళ్లారి అర్బన్: గత ఏడాది నమోదైన వివాహిత, బాలిక అదృశ్యం కేసులను పోలీసులు చేధించారు. తాలూకాలో కొళగల్లు గ్రామానికి చెందిన 21 సంవత్సరాల వివాహిత గత ఏడాది ఏప్రిల్ 24న అదృశ్యమైనట్లు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన బళ్లారి మహిళా పోలీసులు.. వివాహిత బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. వివాహితను తీసుకొచ్చి భర్తకు అప్పగించారు. మరో కేసులో బళ్లారి నగరంలోని రామాంజినేయ నగర్‌కు చెందిన ఓ మైనర్ బాలిక అపహరణకు గురైనట్లు గత ఏడాది నవంబర్ 4న మహిళా పోలీసు స్టేషన్‌లో నమోదైంది. ఈ కేసును కూడా చేధించిన పోలీసులు బాలికను రక్షించారు.
17న ప్రజా చైతన్య ర్యాలీ
బళ్లారి అర్బన్: ప్రత్యేక ఓటరు జాబితా (ఎస్‌ఐఆర్)కు వ్యతిరేకంగా కర్ణాటక లౌకిక పార్టీలు, ప్రజా సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 17న నగరంలో ప్రజాచైతన్య ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎద్దేళ్లు కర్ణాటక నాయకుడు సిద్దన్న తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక పత్రికా భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 17న సాయంత్రం 6 గంటలకు స్థానిక మోతీ సర్కిల్ వద్ద బసవన్న విగ్రహం వద్ద ర్యాలీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మోతీ సర్కిల్, రాయల్ సర్కిల్ వద్దకు చేరుకుని గాంధీ భవన్‌లో బహిరంగ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ వల్ల ఓట్లు తొలగించే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గాదెప్ప, మాజీ బుడా అధ్యక్షుడు హుమయూన్ ఖాన్, సంగనకల్లు విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నియామకం
కోలారు: అఖిల భారత వీర శైవ లింగాయత మహాసభ జాతీయ యువ విభాగం కార్యదర్శిగా కోలారుకు చెందిన స్పందనా సురేష్ నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు ఈశ్వర ఖండ్రే ఆదేశాల ప్రకారం 14 మంది పదాదికారుల జాబితాను మహాసభ విడుదల చేసింది. కోలారులో డిజిటల్ మీడియా సంస్థ నిర్వహిస్తున్న స్పందన సురేష్ నియమితులు కావడంపై పలువురు హర్షం వ్యక్తంచేశారు.
డీఐజీపీ పుట్టిన రోజు
కోలారు: తాలూకాలోని కరోరగండనహళ్లి కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయలో డీఐజీపీ దేవరాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు విశేష పూజలు జరిపారు. తరువాత బృహత్ కేక్‌ను కత్తిరించారు. ఈ కార్యక్రమంలో డిఐజిసి దేవరాజ్ పాల్గొన్నారు. వందలాది అభిమానులు ఆయనకు అభినందలు తెలిపారు. మాజీ ఎంపీ ఎస్ మునిస్వామి, కోముల్ డైరెక్టర్ చలువనహళ్లి నాగరాజ్, జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు జి సురేష్‌బాబు, కెయస్ గణేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
గంగమ్మ ఆలయంలో పూజలు
కెజీఎఫ్: నగరంలోని గణేష పురంలో ఉన్న గంగమ్మ, దుర్గా దేవి దేవాలయంలో ఎంపీ ఎం.మల్లేష్ బాబు ఆదివారం విశేష పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అమ్మవార్లను దర్శించుకుంటే పశ్రాంతంగా ఉంటుందని తెలిపారు. 25 సంవత్సరాలుగా గంగమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకోవడం సంతోషించదగిన విషయమని కొనియాడారు. దేవాలయ అభివృద్ధికి సమితి సభ్యులు, ధర్మకర్తలు శ్రమిస్తున్నారని తెలిపారు.
సర్వీస్ రోడ్డును తెరవాలి
కెజీఎఫ్: రైతుల బండిదోవను (సర్వీస్ రోడ్డు) మూసివేసిన చైన్నె ఎక్స్‌ప్రెస్ హేవే ప్రాధికార అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాలూకాలోని క్యాసంబళ్లి ఫిర్కా వెంగసంద్ర గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని ఎక్స్‌ప్రెస్ హైవే పై ఉన్న సుందరపాళ్య టోల్‌గేట్ వద్ద ప్రతిఘటన నిర్వహించారు. బేతమంగల సిఐ జగదీష్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు వెంకటాచలపతి మాట్లాడుతూ.. జాతీయ యోజనా ప్రాధికార అధికారులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి తక్షణమే మధ్య ప్రవేశం చేసి పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలన్నారు. రైతుల హితవును దృష్టిలో ఉంచుకుని మూసి వేసిన సర్వీస్ రోడ్డును తెరవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సుందరపాళ్య టోల్‌గేట్ వద్ద నిరంతరం ప్రతిఘటన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ త్యాగరాజ్, రైతులు అప్పాజిగౌడ, న్యాయవాది సుబ్రమణి తదితరులు పాల్గొన్నారు.


