హుబ్లీ: సస్పెండ్‌కు గురైన జైలర్ జైలు క్వార్టర్లలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ధార్వాడ కొత్త బస్టాండ్ సమీపంలోని జైలు క్వార్టర్స్‌లో శుక్రవారం సిద్దరామప్ప వడ్డర్(37) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన గత రెండు నెలల నుంచి సస్పెన్షన్‌కు గురై మైసూరు జైలుకు బదిలీ అయ్యారు. అయితే ఇప్పటి వరకు డ్యూటీకి రిపోర్టు చేసుకోలేదు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు నెలల క్రితం విధి నిర్వహణలో లోపం కారణంగా ఆయనను సస్పెండ్ చేశారు. భార్య, ఇద్దరు పిల్లలు పొరుగూరికి వెళ్లిన సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరిగి వచ్చి కన్నీరు మున్నీరయ్యారు. ధార్వాడ ఉపనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
భయంతోనే బలవన్మరణం
ఉన్నతాధికారులు తనపై చర్య తీసుకుని జైలుకు పంపుతారన్న భయంతో తన భర్త సిద్దరామప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య లక్ష్మి తెలిపింది. సస్పెండ్ చేసి మైసూరుకు బదిలీ చేయడంతో మైసూరుకు డ్యూటీకి హాజరు కావడానికి వెళ్లారు. అయితే తల్లిదండ్రుల ముఖాలను చూసి వెళతానని చెప్పి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె వాపోయారు. తరచూ తనను జైలుకు పంపుతారనే భయంతోనే ఆయన ఉండేవారని ఆమె తెలిపారు. పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ శాఖా పరమైన చర్యల కారణంగా రెండు నెలల క్రితం సస్పెండ్ చేశాం. పాలనాత్మక కారణాలతో ఆయన్ను మైసూరుకు బదిలీ చేశాం. ఆయన స్వస్థలం గదగ్ జిల్లా అని, కుటుంబ సభ్యులు ఇచ్చే ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఘటనా స్థలాన్ని పోలీసులు కుటుంబ సభ్యుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించారు.


