బనశంకరి: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ పాల్గొన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి గురించి ప్రధాని, సీఎంలు చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని సీఎం డీకే తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీని సీఎం డీకే కలిసి, బసవేశ్వరుని ప్రతిమను బహూకరించారు. శుక్రవారం ప్రధానితో భేటీకి సమయం కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ నీటి ప్రాజెక్టులు, ఆర్థిక పథకాల గురించి చర్చిస్తాని చెప్పారు. నీతి ఆయోగ్ భేటీలో కర్ణాటక సమస్యలు, అవసరాలను ప్రస్తావించి సహాయం కోరినట్లు తెలిపారు.
ఇస్పేటు ఖాకీల సస్పెండ్
మైసూరు: ఇస్పేటు ఆడుతూ పట్టుబడిన ఇద్దరు పోలీసులను చామరాజనగర ఎస్పీ ముత్తురాజు సస్పెండ్ చేశారు. చామరాజనగర మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేసే పోలీసు మల్లికార్జున, రిజర్వ్ పోలీసు నాగేశ్ బుధవారం రాత్రి పెద్ద గుంపులో ఇస్పేటు ఆడుతుండగా పోలీసులు దాడి చేయడంతో దొరికిపోయారు. ఈ నేపథ్యంలో ఎస్పీ చర్య తీసుకున్నారు. గతంలో, ఎస్పీ దివ్య థామస్ హయాంలో సాయుధ రిజర్వ్ దళానికి చెందిన కొందరు సిబ్బంది పట్టుబడి సస్పెండ్ అయ్యారు.
నేడు మూకాంబిక దర్శనానికి తమిళనాడు సీఎం
దొడ్డబళ్లాపురం: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేడు శుక్రవారం ఉడుపి జిల్లాలోని ప్రసిద్ధ కొల్లూరు మూకాంబికా దేవాలయాన్ని సందర్శించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో చుట్టుపక్కల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ భక్తులు దర్శనానికి రాకపోవడం మంచిదని అధికారులు సూచించారు. సీఎం వస్తుండడం వల్ల భద్రతా తనిఖీల వల్ల భక్తులకు ఇబ్బంది కలగవచ్చని, అందువల్ల దర్శనం సమయాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు తెలిపారు.
సాంబార్‌లో బల్లి,
విద్యార్థినులకు అస్వస్థత
యశవంతపుర: బల్లి పడిన సాంబారును సేవించి 15 మంది యువతులు అస్వస్థతకు గురైన ఘటన హాసన్ తాలూకా సారాపురలోని అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్‌లో జరిగింది. బుధవారం రాత్రి వండిన సాంబార్‌లో బల్లి పడింది. అది తెలియక సాంబార్‌ను ఆరగించారు. కొంతసేపటికే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి తదితరాలతో విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. వారిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. సిలిండర్‌లు లేకపోవడంతో బయట కట్టెల పొయ్యిపై వంట చేశారు, ఆ సమయంలో బల్లి పడినట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. నాలుగు వందల మంది విద్యార్థినులున్న హాస్టల్ గ్యాస్ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటోంది. వంట గదిలో పరిశుభ్రత లేక బల్లులు తిరుగుతున్నాయని విద్యార్థినులు ఆరోపించారు.
ఘనంగా కరియమ్మ జాతర
బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని అరసికెరె గ్రామ దేవత అయిన శ్రీకరియమ్మ శ్రీ మల్లిగమ్మ దేవి జాతర బుధవారం రాత్రి భక్తిశ్రద్ధలతో జరిగింది. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరిగింది. బుధవారం, మూలస్థానంలోని పంచమాతలు కరియమ్మ దేవి, మల్లిగమ్మ దేవి, చెలువరాయ స్వామి, దూతరాయ స్వామి, కెంచరాయ స్వామిల ఉత్సవ విగ్రహాలకు విశేషంగా అలంకరించి పూజలు చేశారు. శ్రీకరియమ్మ అమ్మవారిని వెండి రథంలో ఊరేగించారు. ఆలయంలో భక్తులు పూజలు చేసి పండ్లు, కూరగాయలను సమర్పించారు.


