పోలీసులూ.. నేరగాళ్లతో కలవద్దు | - | Sakshi
Sakshi News home page

పోలీసులూ.. నేరగాళ్లతో కలవద్దు

Jun 12 2026 5:57 AM | Updated on Jun 12 2026 5:57 AM

బనశంకరి: రౌడీలు, నేరగాళ్లతో, నేరాల చరిత్ర కలిగినవారితో సంబంధాలు కలిగి ఉండటం, సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నట్లు కనబడితే అలాంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని నూతన హోం మంత్రి ప్రియాంక్‌ ఖర్గే హెచ్చరించారు. గురువారం బెంగళూరు పోలీస్‌ కమిషనరేట్‌లో పోలీస్‌ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌, ట్రాఫిక్‌ సమస్యల నివారణ గురించి తీసుకుంటున్న చర్యలుపై చర్చించారు.

పార్టీలు, సెల్ఫీలు ఏమిటి?

సమావేశం తరువాత విలేకరులతో ప్రియాంక్‌ఖర్గే మాట్లాడారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో రౌడీ నియంత్రణ దళం ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. కిందిస్థాయి పోలీసులు రౌడీల బర్త్‌ డేలలో పాల్గొనడం, పార్టీలు, విందులు చేసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం లాంటివి చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవన్నారు. బెంగళూరులో ట్రాఫిక్‌ రద్దీని సౌకర్యాల కల్పన, లోపాల పరిష్కారం ద్వారా సరిదిద్దాలని తీర్మానించామని తెలిపారు. దీని కోసం పలు సంస్థల సహకారం తీసుకుంటామన్నారు.

సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌పై

బెంగళూరు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఐటీ కేంద్రం కావడంతో ఇక్కడ సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. సైబర్‌ నేరాల నియంత్రణకు హోంశాఖ, ఐటీ బీటీ, ఈ–పాలన శాఖలతో కలిపి సమగ్ర విధానం తీసుకువస్తామని తెలిపారు.

డ్రగ్స్‌ ముఠాలపై హోంశాఖ ఉక్కుపాదం మోపుతుందని, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సరఫరా అయ్యే డ్రగ్స్‌, మత్తు పదార్థాలను కనిపెట్టడానికి సరిహద్దుల్లో టెస్టింగ్‌లను పెంచుతామని తెలిపారు.

నగరంలో విదేశీ పౌరులు చట్టవ్యతిరేకంగా నివసిస్తుంటే బహిష్కరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని, కేంద్ర విదేశాంగ శాఖతో చర్చిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఫిర్యాదులు చేస్తే కేసు నమోదు చేయకపోవడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించే పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

నూతన హోంమంత్రి ప్రియాంక్‌ ఖర్గే సూచన హెచ్చరిక

పోలీసు అధికారులతో సమీక్ష

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement