పొట్టకూటి కోసం పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

పొట్టకూటి కోసం పడిగాపులు

Jun 12 2026 5:57 AM | Updated on Jun 12 2026 5:57 AM

సాక్షి బళ్లారి: సూర్యోదయానికి ముందుగానే కొప్పళలోని లాల్‌బహుదూర్‌శాస్త్రిభి సర్కిల్‌ను ఒకసారి చూస్తే అక్కడ కనిపించే దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి. వందలాది మంది కూలీలు పల్లెటూళ్లు, పట్టణాల నుంచి వచ్చిన వారు లుంగీలు, చొక్కాలు ధరించి చేతిలో పనిముట్లను పట్టుకొని పని కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. వారి కళ్లల్లో కనిపించే ఆశ, దాని వెనుక ఉన్న బాధలు, ఆరోజు పని దొరికితే కుటుంబానికి అన్నం పెట్టగలమనే ఆరాటం ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తుంది. మామూలుగా నగరాల్లో, పల్లెటూళ్లలో ఏదైనా పనికి వ్యవసాయ కూలీలు దొరకాలంటే వెతకాల్సిన పరిస్థితులుంటాయి. అయితే కొప్పళ నగరంలో లేబర్‌ సర్కిల్‌కు వస్తే ఎలాంటి పనికై నా కూలీలు ఇట్టే దొరికిపోతారు. ఇంటి పనులకు సంబంధించి ప్లంబింగ్‌, పెయింటింగ్‌, భవనాలు, ఇళ్ల క్లీనింగ్‌, వ్యవసాయ పనులకు కానీ ఆ సర్కిల్‌కు వస్తే కూలీలు దొరకడం గమనార్హం.

లేబర్‌ సర్కిల్‌గా గుర్తింపు

కొప్పళలో కూలీలంతా ఐకమత్యంగా ఒక చోట చేరుతారు. లాల్‌బహుదూర్‌ శాస్త్రి సర్కిల్‌ను లేబర్‌ సర్కిల్‌గా పిలుస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున కూలీలు అక్కడికి వస్తుంటారో అర్థం చేసుకోవచ్చు. గడియార స్తంభం, భాగ్యనగర పట్టణ పంచాయతీ కార్యాలయం ముందు కూడా అవే దృశ్యాలు కనిపిస్తుంటాయి. వీరికి ఎలాంటి చదువు కూడా ఉండదు. అయితే టెక్నాలజీ సంబంధించి పనులను కూడా వీరు నిర్వహిస్తుంటారు. స్వంత ఊళ్లలో పని దొరకకపోవడంతో ఇక్కడికి వచ్చి తమ పిల్లలను చదివించుకునేందుకు రోజు వారి పనులు దొరికితే చాలన్న సంతోషంతో ఎదురు చూస్తుంటారు. గోడలు కట్టడం, ఇనుప కడ్డీలను అమర్చడం, కాంక్రీట్‌ పనులు చేయడం, విద్యుత్‌ వైరింగ్‌, పరికరాల అమరిక, నీటి ట్యాంక్‌లను శుభ్రపరచడం వంటి పనులు, డ్రైనేజీలను శుభ్రంచేయడం వంటి అనే పనులను చేస్తూ పొట్టనింపుకునే వారు ఇక్కడ వందలాది మంది కనిపిస్తుండటం విశేషం.

అక్కడ అందుబాటులో కూలీకార్మికులు

గత 30 ఏళ్లుగా లాల్‌బహుదూర్‌శాస్త్రి సర్కిల్‌ లేబర్‌ సర్కిల్‌గా మారింది. అక్కడికి వస్తే ఎలాంటి పనులకై నా కార్మికులు దొరుకుతారనేది ప్రజల నమ్మకం. తమ పిల్లల చదువుకు, వారి ఆశలను తీర్చేందుకు తాము నిత్యం ఇక్కడికి వచ్చి తమకు నైపుణ్యం ఉన్న పనులను చేస్తూ పొట్టనింపుకుంటున్నామని పలువురు పేర్కొంటున్నారు. చదువు లేకపోయినా తమ అనుభవాన్నే తెలివిగా మార్చుకొని యజమానులను మెప్పించి ఉపాధి పొందుతున్నామన్నారు. లేబర్‌ సర్కిల్‌ వద్ద ఉదయం వేళ కారు, బైక్‌ వస్తే సార్‌.. రండి..సార్‌.. ఏ పనైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారితో మాటలు కలుపుతారు. రోజు వారి కూలీలు ఈ జీవితం కేవలం ఉపాధి కోసం చేసే పోరాటం మాత్రమే కాదు, కుటుంబాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం జీవితంలో సాగించే నిరంతర యుద్ధమని పలువురు అంటున్నారు.

పాలకుల నుంచి అందని సహకారం

దశాబ్దాల తరబడి ఇక్కడ వందలాది మంది కూలీలు పొట్టకూటి కోసం ఆరాటపడుతున్నా పాలకులు, అధికారులు తమకు ఎలాంటి సహకారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ భవన నిర్మాణానికి సంబంధించి కార్మికులే పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు చేయింకోవడానికి ప్రయత్నించే వారు ఈ సర్కిల్‌కు వస్తే సునాయాసంగా ఇళ్లు పూర్తయ్యే వరకు అన్ని విధాలా పని చేసే కార్మికులు దొరుకుతారు. పని కోసం ఎదురు చూసే కార్మికులకు పని దొరకడం ఎంత కష్టమో ఒక్కొక్క సారి పనులు చేయించుకునేందుకు కార్మికులు దొరకక పోవడంతో ఎన్నో ఇబ్బందులు పడి లేబర్‌ సర్కిల్‌కు వస్తే కార్మికులు దొరుకుతుండటంపై స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు కాయకష్టం చేసే కార్మికులు మంగళ, శుక్రవారాల్లో సమీపంలోని హులిగి వద్ద తుంగభద్ర నదిలో స్నానం చేసి హులిగమ్మ దేవిని దర్శించుకొని తమకు ఇష్టమైన ఆహారం వండుకొని అక్కడ బంధువులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కూలీలు వారానికి రెండు రోజులు సెలవు తీసుకొని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో గడపడానికి సమయాన్ని కేటాయిస్తారు.

లేబర్‌ సర్కిల్‌ వద్ద పనుల కోసం గుమిగూడిన కార్మికులు

సర్కిల్‌లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువకులు

రెక్కాడితే కాని డొక్కాడని పేదలు

కూలికార్మికుల జీవన్మరణ పోరాటం

పట్టెడన్నం కోసం అన్ని రకాల పనులు

ఏ పనికి కార్మికులు అవసరమైనా

లేబర్‌ సర్కిలే శరణ్యం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement