హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని నవలగుందలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.5,12,000 విలువ చేసే 46 గ్రాముల బంగారు ఆభరణాలు, చోరీకి వాడిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 31న నవలగుందలో ఇంటి చోరీ జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన నవలగుంద సీఐ రవికుమార్ నేతృత్వంలో ఎస్‌ఐ జనార్ధన్, ఉమాదేవి తదితర సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాలు నవలగుంద పట్టణం, అలాగే శివారులోని వివిధ సీసీ టీవీ కెమెరాలను వివిధ కోణాల్లో పరిశీలించి కెమెరాల ద్వారా లభించిన దృశ్యాలు, అలాగే టెక్నికల్ ఆధారాలతో నిందితుల జాడ పట్టుకొని వారి అసలైన అడ్రస్‌లను గుర్తించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణ వేళ చోరీ చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. వీరు బెళగావి జిల్లాకు చెందిన వారని, ప్రస్తుతం వీరిని జుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు.
గృహలక్ష్మి లబ్ధిదారులకు ఆందోళన వద్దు
హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశం వచ్చే వరకు గృహలక్ష్మి పథకం మహిళా లబ్ధిదారులు కేవైసీ చేయించరాదని హుబ్లీ ధార్వాడ పడమటి విధానసభ గ్యారెంటీ అమలు కమిటీ అధ్యక్షుడు ఆనంద మూశన్నవర తెలిపారు. ఈ పథకం లబ్ధి పొందడానికి కేవైసీ చేయించాలని వదంతులు వ్యాపించడంతో మహిళలు గ్రామ వన్, కర్ణాటక వన్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ప్రభుత్వ ఆదేశం లేకపోయినా అనవసరంగా మహిళలు గ్రామ వన్, కర్ణాటక వన్ కేంద్రాల్లో అడిగినంత డబ్బులు చెల్లించి కేవైసీ చేయిస్తున్నారు. సదరు కేంద్రాల సిబ్బంది సామాన్య మహిళలకు తగిన సమాచారం ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆదేశం వచ్చే వరకు మహిళలు కేవైసీ చేయించాల్సిన అవసరం లేదని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
రౌడీషీటర్ల ఇళ్లపై పోలీసు దాడులు
హుబ్లీ: శాంతి భద్రతల రక్షణే లక్ష్యంగా బెళగావి నార్త్ రేంజ్‌లోని బెళగావి, విజయపుర, బాగలకోటె, ధార్వాడ, గదగ్ జిల్లాల్లో ఆయా జిల్లా ఎస్పీల నేతృత్వంలో అధికారుల బృందాలు రౌడీషీటర్ల ఇళ్లపై దాడి చేసి కొరడా ఝళిపించాయి. రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో 456 మంది రౌడీషీటర్ల ఇళ్లపై దాడి చేసి రూ.8.5 లక్షల నగదు, నెంబర్ ప్లేట్, రికార్డులు లేని 10 వాహనాలు, రెండు మచ్చుకత్తులను జప్తు చేశారు. కోర్టు నుంచి పరారైన ఇద్దరు రౌడీలను అరెస్ట్ చేశారు. వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కేసులు నమోదైనట్లు బెళగావి నార్త్ రేంజ్ ఐజీ సందీప్ పాటిల్ తెలిపారు.
ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌ల సదస్సు
బళ్లారిఅర్బన్: నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు నూతన ఆవిష్కరణలు, ఆధునిక నిర్మాణ విధానాలపై నిరంతరం అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఆర్కిటెక్ట్స్ మీట్–2026 కార్యక్రమం బుధవారం సాయంత్రం నగరంలోని హోటల్ రాయల్ ఫోర్ట్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాణ రంగానికి సంబంధించిన నూతన సాంకేతికతలు, ఆధునిక భద్రతా ప్రమాణాలు, స్మార్ట్ లాకింగ్ వ్యవస్థలు, భవన నిర్మాణంలో వినియోగిస్తున్న అత్యాధునిక ఆర్కిటెక్చరల్ విధానాలపై నిపుణులు సమగ్రంగా వివరించారు. భవనాల భద్రత, నాణ్యత, సౌందర్యాన్ని పెంపొందించడంలో ఆధునిక సాంకేతికతల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఏసీసీఈఏ అధ్యక్షుడు సత్యనారాయణ, శశిధర్, రాకేష్, సుభాష్ చంద్ర, సునీల్ పాల్గోన్నారు.
చుక్కి ఫౌండేషన్
అవార్డుల పంపిణీ
రాయచూరు రూరల్: ఉమాపతి చుక్కి 50వ పుణ్యారాధనను పురస్కరించుకుని గురువారం జిల్లాలోని సిరవారలో చుక్కి ఫౌండేషన్ అవార్డులను అందచేశారు. ఈసందర్భంగా మాజీ మంత్రి బోసురాజు మాట్లాడుతూ చుక్కి ప్రతిష్టాన చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు, చర్చాగోష్టులు జరగాలన్నారు. సమావేశంలో ఆళంద విశ్వనాథ్ కూరేణేశ్వర శివాచార్య స్వామీజీ, శాసన సభ్యుడు హంపయ్య నాయక్, చుక్కి ప్రతిష్టాన అధ్యక్షులు శివానంద, సభ్యులు శివకుమార్, రంగణ్ణ పాటిల్, మల్లికార్జున, జ్యోతి, సిద్దలింగప్ప, హాజీ చౌద్రిలున్నారు.
మౌలిక సౌకర్యాలు కల్పించరూ
రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కేఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. గురువారం జిల్లాలోని సింధనూరు తాలూకా గోమర్సి ప్రభుత్వ పాఠశాల వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు నిరుపాది మాట్లాడారు. పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీరు, పార్కింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి, క్రీడా మైదానం నిర్మించాలని కోరుతూ జీపీ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో అప్పయ్య, ఉమేష్, విరుపణ్ణ, వీరేష్, నాగప్ప, అజ్మీర్ శంశుద్దీన్‌లున్నారు.


