● జిల్లా అభివృద్ధికి సహకారం అందించాలని వినతి
సాక్షి,బళ్లారి: జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్‌ను కలిశారు. గురువారం నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే గణేష్ తదితరులు డీసీఎంను మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాకు చెందిన పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. రోడ్లు, వంతెనలు, మంచినీటి సమస్య తదితరాలపై సమగ్రంగా చర్చించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. ఎమ్మెల్యేల అభ్యర్థనలపై స్పందించిన డీసీఎం కంప్లి, బళ్లారి నగరాభివృద్ధికి సంపూర్ణంగా ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. అవసరమైన చర్యలు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని తెలిపారు.
పాము కాటుకు రైతు బలి
రాయచూరు రూరల్: పాము కరిచి ఓ రైతు మృతి చెందిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం అరకెర తాలూకా కరడిగుడ్డలో పొలం పనులు చేస్తుండగా బసవరాజ్(54)ను పాము కరవడంతో దేవదుర్గ తాలూకాస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ రైతు గురువారం ఆస్పత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
మౌలిక సౌకర్యాలకు పెద్దపీట
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరులో మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత కల్పించాలని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. గురువారం సింధనూరు నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. తాగునీటి జలాశయం, వివిధ ప్రాంతాల్లో వర్షాకాలంలో మురుగు కాలువల్లో పూడిపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తుర్విహాళ్ ప్రభుత్వాస్పత్రిని, ఇందిరా క్యాంటీన్లను సందర్శిచి రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు. రైతులకు ఎరువుల, పురుగు మందుల కొరత రాకుండా దుకాణాలను తనిఖీ చేయాలన్నారు.
చెరువులను సంరక్షించండి
రాయచూరు రూరల్: నగరంలో పురాతన కాలం నాటి చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి బోసురాజు వెల్లడించారు. గురువారం నగరంలోని నీరుబావికుంటలో చెరువుల సంరక్షణకు శ్రీకారం చుట్టి ఆయన మాట్లాడారు. పట్టణాలకు తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పైపులైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పురాతన కాలం నాటి చెరువులకు మహర్దశ కల్పించాలనే సదాశయంతో పనులను త్వరిగతిన చేపట్టాలన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, ఎంపీ కుమార నాయక్, నేతలు లక్ష్మిరెడ్డి, బసవరాజ్ పాటిల్, రుద్రప్ప, జయంత్ రావ్, శేఖర్‌రెడ్డి, శివమూర్తి శాంతప్ప, గోవింద రెడ్డి, నరసింహులు, సుభాష్‌లున్నారు.
రూ.వెయ్యి లంచం..
నాలుగేళ్ల జైలు
హోసూరు: తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెళ్లి సహాయ నిధి పథకం ద్వారా అర్హులకు నిధి సహాయం అందజేసేందుకు రూ. వెయ్యి లంచం పుచ్చుకొన్న మహిళా ఉద్యోగినికి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ క్రిష్ణగిరి కోర్టు తీర్పునిచ్చింది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా మత్తూరు దగ్గర కణ్ణండహళ్లి గ్రామానికి చెందిన రంగస్వామి కూతురికి ప్రభుత్వ పెళ్లి సహాయ నిధి పథకానికి గత 2008లో దరఖాస్తు చేసుకొన్నాడు. ఆ సమయంలో బీడీవో ఆఫీసు ఉద్యోగిని ఇంద్రాణి (45), వెయ్యి రూపాయల లంచం డిమాండ్ చేసింది. రంగస్వామి క్రిష్ణగిరి ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకుంటూ ఉండగా పోలీసులు ఇంద్రాణిని అరెస్ట్ చేశారు. ఈ కేసు క్రిష్ణగిరి కోర్టులో జరుగుతూ వచ్చింది. గురువారం ఉదయం కేసును విచారణ జరిపిన న్యాయమూర్తి లత.. ముద్దాయికి నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.


