విధానసౌధ ఆవరణలో రైతన్న ఘోష | - | Sakshi
Sakshi News home page

విధానసౌధ ఆవరణలో రైతన్న ఘోష

Jun 11 2026 7:59 AM | Updated on Jun 11 2026 7:59 AM

శివాజీనగర: విధానసౌధ ఆవరణలో ఉన్న చెట్టుకు ఓ రైతు మంగళవారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర సంచలనం కలిగించింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఈ సంఘటన అద్దం పట్టింది. వివరాల ప్రకారం.. చిక్కమగళూరు జిల్లా హుళియూరు గ్రామానికి చెందిన విశుకుమార్‌ (52) అనే రైతు విధానసౌధ ఆవరణలోని చెట్టుకు ఎక్కి ఉరి వేసుకోవడానికి ప్రయత్నించారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం తన గంధపు తోటను స్వాధీనం చేసుకొని, పరిహారం చెల్లించలేదని రైతు తెలిపాడు. గతంలోనూ ఇదే సమస్యలో 2025లో ఆయన విధానసౌధకు వచ్చి చెట్టును నరికి నిరసన తెలిపాడు. ఇప్పుడు అదే చెట్టు వద్దకు చేరుకొని ఆకుపచ్చ టవల్‌తో ఉరి బిగించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆయనను గమనించి కిందకు రప్పించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

జిల్లాధికారికి కోర్టు ఆదేశించినా..

ఆ తరువాత రైతు మీడియాతో మాట్లాడుతూ నా భూమిని స్వాధీనం చేసుకుని ఇంతవరకూ పరిహారాన్ని ఇవ్వలేదని ఆరోపించారు. నాలుగు వారాల్లో పరిష్కరించి పరిహారాన్ని చెల్లించాలని చిక్కమగళూరు జిల్లాధికారికి న్యాయస్థానం ఆదేశించింది, అయితే 3 నెలలు గడచినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. తోటలో శ్రీగంధపు చెట్లను పెంచాను, నోటీస్‌ ఇవ్వకుండానే చెట్లను కట్‌ చేయడానికి వచ్చారు అని అధికారుల ఆగడాలను వివరించారు.

చెట్టుకు ఉరివేసుకునే యత్నం

భూమికి పరిహారం ఇవ్వలేదని వెల్లడి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement