బనశంకరి: నాకు ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక అనుబంధం ఉంది. అది రాజ్యసభ స్థానం కంటే ఎక్కువ అని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ అన్నారు. జేడీఎస్– బీజేపీ సంకీర్ణం నుంచి ఆయనకు రెండవసారి రాజ్యసభ సీటు దక్కలేదని కాంగ్రెస్ నాయకులు పలు రకాల విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవేగౌడ బుధవారం బెంగళూరులో పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం కంటే ప్రజాసేవ ముఖ్యమని అన్నారు. సీటు ఇవ్వకుండా అవమానం చేశారని కొందరు చెప్పడంలో అర్థం లేదన్నారు. నాకు, మోదీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, రాజ్యసభ సీటు దీనిని చెడగొడుతుందని ఎవరైనా భావిస్తే అది వారి మూర్ఖత్వమని దళపతి అన్నారు. తాను ఒకానొక సమయంలో మోదీని కటువుగా విమర్శించింది నిజమని, కానీ కొన్నేళ్లుగా నేను ఆయనను అర్థం చేసుకున్నానని తెలిపారు. మంచి పనులను మనస్ఫూర్తిగా కొనియాడానని అన్నారు. తాను ఊరికే కూర్చోనని, జేడీఎస్ బలోపేతానికి శక్తిమీరి పనిచేస్తానని, రాష్ట్ర కేంద్ర విషయాలపై మాట్లాడతానని కాంగ్రెస్‌ను ఉద్దేశించి తెలిపారు.
రాజ్యసభ సీటు రాలేదని అపోహలు వద్దు
దళపతి దేవేగౌడ వ్యాఖ్యలు


