రాయచూరు రూరల్: తెలంగాణ, కర్ణాటక అంతర్రాష్ట్ర జల వివాదాలకు తెరదించడానికి ఇరు రాష్ట్రాల నాయకులతో చర్చలు కొలిక్కి వచ్చే దశలో ఉన్నాయని మాజీ మంత్రి, విధాన పరిషత్ సభ్యుడు ఎన్‌ఎస్ బోసురాజు పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతం యాదగిరి, నారాయణపేట మధ్య గుడ్డందొడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మక్తల్, నారాయణపేటె, కోడంగల్‌లకు భీమా, కృష్ణా నదుల నుంచి నీటిని పొందుతున్నారన్నారు. నీటి వినియోగం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి సుముఖంగా ఉన్నారన్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండడం వల్ల నారాయణపుర డ్యాం నుంచి కింది భాగంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర రైతుల శ్రేయస్సు కాపాడగలమన్నారు. నారాయణపుర డ్యాం నుంచి కింది భాగంలో బ్యారేజీ కం, బ్రిడ్జిల నిర్మాణానికి తెలంగాణ సర్కార్ సానుకూలంగా ఉందన్నారు. నూతన మంత్రివర్గంలో పదవి కోసం పాకులాడటం లేదన్నారు. ఆల్మట్టి ఎత్తును పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలన్నారు. చిక్క మంచాల, చీకలపర్విల వద్ద బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు. నూతనంగా మటమారి వీరభద్రేశ్వర ఎత్తిపోతల పథకానికి అనుమతి లభించిందన్నారు. ఎంపీ కుమార నాయక్, రుద్రప్ప అంగడి, అమరేగౌడ, శాంతప్ప, జయన్న, తాయన్న నాయక్, సమీర్, నరసింహులు, శాలం, శివమూర్తిలున్నారు.


