ఎల్‌ఎల్‌సీ వద్ద యువకుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఎల్‌సీ వద్ద యువకుడి దారుణ హత్య

Jun 10 2026 1:37 AM | Updated on Jun 10 2026 1:37 AM

బళ్లారిఅర్బన్‌: తాలూకాలోని తంబ్రళ్లి గ్రామ సమీపంలోని ఎల్‌ఎల్‌సీ కాలువ వద్ద ఓ యువకుడి మృతదేహం సగం కాలిన స్థితిలో మంగళవారం లభించింది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసి మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. కాలువ వద్దకు వెళ్లినవారు మృతదేహాన్ని గమనించి మోకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలోని బొల్లనగుడ్డం గ్రామానికి చెందిన బసవనగౌడ(27)గా పోలీసులు గుర్తించారు. మృతుడు బళ్లారిలోని ఓ ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో యువకుడిపై దాడి చేసి హత్య చేశారు.

పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

అనంతరం మృతదేహాన్ని సుమారు 13 కిలోమీటర్ల దూరంలోని తంబ్రళ్లి గ్రామ సమీపంలోని ఎల్‌ఎల్‌సీ కాలువ వద్దకు తరలించి పెట్రోల్‌ పోసి నిప్పటించినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మంటలు పూర్తిగా వ్యాపించక పోవడంతో మృతదేహం సగం కాలిన స్థితిలో బయటపడింది. మృతదేహం లభించిన ప్రదేశానికి సుమారు 13 కిలో మీటర్ల దూరంలో మృతుడికి చెందిన పల్సర్‌ మోటార్‌ సైకిల్‌, చెప్పులు లభ్యమైనట్లు తెలిసింది. సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, హత్య జరిగిన తీరు పరిశీలిస్తే ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కోణంలో హత్య జరిగిందా? అని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు.

సగం కాలిన స్థితిలో యువకుడి మృతదేహం

మృతుడికి చెందిన పల్సర్‌ మోటార్‌ సైకిల్‌

సగం కాలిన స్థితిలో మృతదేహం

ప్రేమ వ్యవహారమే కారణంగా

అనుమానం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement