బళ్లారిటౌన్: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా గద్దికేరికి చెందిన మహిమాన్విహితుడు చరంతప్పజ్జ స్వాముల 22వ పుణ్య స్మరణ ఉత్సవాన్ని ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు పార్వతి నగర్‌లోని బసవ భవన్‌లో ఏర్పాటు చేసినట్లు నందిపుర పుణ్యక్షేత్రం డాక్టర్ మహేశ్వర స్వామీజీ పేర్కొన్నారు. మంగళవారం పత్రికా భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అవార్డు ప్రదానం, వివిధ గ్రంథాల విడుదల, గ్రంథ ప్రదర్శన, ఉచిత కంటి చికిత్స శిబిరం, రక్తదానం శిబిరం, గుండె, ఎముకలు, కీళ్లు, యోగా థెరపీ వంటి శిబిరాలతో పాటు సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. తొలి రెండు రోజులు సాయంత్రం 6.30 గంటల నుంచి కార్యక్రమాలు ఉంటాయని, 13వ తేదీ చివరి రోజున వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి సండూరు విరక్త మఠం ప్రభుస్వామీజీ సానిధ్యం వహిస్తారన్నారు. కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు. సమావేశంలో నేతలు పంచాక్షరప్ప, శివానంద, తిమ్మప్ప, బసవరాజు, వామన్న, రేణుకమ్మ, నటరాజు, చెన్నబసవ పాల్గొన్నారు.


