శివాజీనగర: కన్నడనాట మరోసారి రిసార్ట్ రాజకీయం మొదలైనట్లే మొదలై చివరి ఘడియల్లో రద్దయింది. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో, ఇటు బెంగళూరులో పెద్ద తతంగమే సాగింది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్, ఆపరేషన్ కమలం ఆందోళనల నడుమ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించాలని సాయంత్రం విమానంలో బయల్దేరారు. కొందరు ఎమ్మెల్యేలు అక్కడి అధికార పార్టీ బీజేపీ వలలో పడతారనే భయాలున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకు మొత్తం ఎమ్మెల్యేలను ఉద్యాననగరికి పంపించాలని నిర్ణయించారు. వారి కోసం బిడదిలోని వండల్ లాలో స్థానిక కాంగ్రెస్ నాయకులు వారి అతిథ్యం, పర్యవేక్షణ చేపట్టారు. పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకు కూడా ఎమ్మెల్యేలు ఇక్కడే బస చేయాలని, పోలింగ్ రోజున బెంగళూరు నుంచి నేరుగా మధ్యప్రదేశ్‌కు తీసుకు వెళ్లాలని తీర్మానించారు.
భోపాల్ నుంచి బయల్దేరిన మధ్యప్రదేశ్
ఎమ్మెల్యేల విమానం వెనక్కి
రాజ్యసభ ఎన్నికల్లో జాగ్రత్త చర్యలు
అనూహ్యంగా అభ్యర్థి నామినేషన్ రద్దుతో రిసార్టు బస క్యాన్సిల్
మొత్తం తారుమారు
భోపాల్ నుంచి చార్టర్డ్ విమానంలో 63 మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రికి దేవనహళ్ళి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు వారికి స్వాగతం పలికి రిసార్టుకు తరలించడానికి చేరుకున్నారు. కాంగ్రెస్ ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాల కూడా వచ్చారు. కానీ అంతలోనే ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మధ్యప్రదేశ్ నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరిస్తున్నట్లు సాయంత్రం ప్రకటించింది. ఆమె నామినేషన్‌లో పలు వివరాలను పొందుపరచలేదని ఈసీ అభ్యంతరం తెలిపింది. దీంతో మధ్యప్రదేశ్‌లో ఓ అభ్యర్థి తగ్గడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు నిర్ణయమైంది. ఈ ఆకస్మిక పరిణామంతో ఎమ్మెల్యేల బెంగళూరు క్యాంపును కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకుంది. బెంగళూరుకు బయల్దేరిన విమానాలు మళ్లీ భోపాల్‌కు వెళ్లిపోయినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల 10 రోజుల విలాసవంత యాత్ర ఇలా రద్దయింది.
నామినేషన్ల ఆమోదం
శివాజీనగర: కర్ణాటక నుంచి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగేనా?, ఏకగ్రీవమయ్యేనా అనే కుతూహలానికి తెరపడింది. ఈ స్థానాలకు అభ్యర్థులు సమర్పించిన నాలుగు నామినేషన్లు ఆమోదం పొందడంతో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖరారైంది. అదనపు అభ్యర్థులు పోటీలో లేకపోవడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు మన్సూర్ అలీఖాన్, పవర్ ఖేరా, అలాగే బీజేపీ నుంచి నాగరాజు నామినేషన్ దాఖలు చేయడం తెలిసిందే. విధానసౌధలో ఎన్నికలాధికారి కే.ఎం.విశాలాక్షి నామినేషన్ పత్రాలను పరిశీలించి సక్రమంగా ఉన్నాయని ఆమోదం తెలిపారు.
తప్పిన పోలింగ్ ప్రక్రియ
అదనంగా అభ్యర్థులు రంగంలో ఉంటే ఎమ్మెల్యేలచే రహస్య ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ దఫా పార్టీలు సామరస్యంగా స్థానాలను పంచుకొన్నాయి. దీంతో ఏ విధమైన బేరాలకు ఆస్కారం లేకుండా పోయింది. నామినేషన్‌ల ఉపసంహరణకు జూన్ 11న ఆఖరు రోజు. ఆ రోజు సాయంత్రం గడువు తీరగానే ఏకగ్రీవ ఫలితాలను ప్రకటిస్తారు.


