లక్ష్మీ నరసింహా నమోస్తుతే | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీ నరసింహా నమోస్తుతే

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

కోలారు: ముళబాగిలు తాలూకాలోని కదరిపుర గ్రామంలోని పురాణ ప్రసిద్ధ కంబద శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయంలో అధిక జేష్ట మాసం సందర్భంగా మంగళవారం స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. గణపతి ప్రార్థన, స్వస్తి వచనం, పుణ్యావహం, మూల లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం తదితర ధార్మిక కార్యక్రమాలను నెరవేర్చారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.

విద్యార్థులపై తేనెటీగల దాడి

బనశంకరి: తేనెటీగలు కుట్టడంతో 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా ముండగోడు తాలూకా మొరార్జీ దేశాయ్‌ వసతి పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం భోజన వేళలో విద్యార్థులు తరగతి నుంచి బయటికి వచ్చారు. ఈ సమయంలో పాఠశాల రెండో అంతస్తులో ఉన్న తేనెగూడును ఎవరో విద్యార్థి రాయితో కొట్టడంతో తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. 21 మందిని కుట్టడంతో నొప్పితో విలపించసాగారు. బాధితులను ముండగోడు తాలూకా ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

20 రోజుల్లో పెళ్లి..

అంతలోనే బ్రెయిన్‌డెడ్‌

అవయవ దానంతో ఘనత

విజయపుర: బెంగళూరు రూరల్‌ విజయపుర పట్టణానికి సమీపంలో ఉన్న ఐబసాపుర గ్రామానికి చెందిన శామణ్ణ కుమారుడు దీపక్‌ కుమార్‌ (32) జూన్‌ 4న సహకార నగర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. యలహంక స్పర్శ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విషమించగా, మంగళవారం బ్రెయిన్‌డెడ్‌ అని వైద్యులు తెలిపారు. దీపక్‌ కుమార్‌కు 20 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. వైద్యుల వినతి మేరకు ఆయన కుటుంబ సభ్యులు దీపక్‌ అవయవాలను దానం చేశారు. గుండె, మూత్రపిండాలు, కళ్లు, కాలేయం తదితర అవయవాలను వైద్యులు సేకరించి అవసరమైన రోగుల కోసం పంపించారు.

రౌడీల కట్టడికి ప్రత్యేక దళం

వారంరోజుల్లో ఏర్పాటుకు

సర్కారు ఆదేశం

బనశంకరి: రాష్ట్రంలో పెచ్చుమీరిన రౌడీయిజం, అసాంఘిక శక్తుల అణచివేతకు ప్రత్యేక పోలీసు బలగం ఏర్పాటు కానుంది. సీఎం డీకే.శివకుమార్‌ నిర్వహించిన పోలీసు అధికారుల సమావేశంలో దీనిపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్కిల్‌, పోలీస్‌స్టేషన్‌ స్థాయిలో యాంటీ రౌడీ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ ఎంఏ.సలీం ఆదేశించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటం, ప్రజలు నిర్భయంగా జీవించడానికి రౌడీయిజం, గూండాయిజం రహిత సమాజం అవసరమని ప్రభుత్వ ఆదేశాల్లో తెలిపింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీఐ నేతృత్వంలో రౌడీ నియంత్రణ దళం ఉంటుంది.

నిఘా.. నియంత్రణ

క్రిమినల్‌ కేసుల్లో ఉన్న వ్యక్తుల చరిత్రను పరిశీలించి కొత్తగా రౌడీషీట్‌ తెరవడం, రౌడీల కౌన్సెలింగ్‌, నిఘా వంటి పనులను నిర్వహిస్తారు. రౌడీషీటర్ల ఇళ్లు, అడ్డాలపై తరచూ దాడులు చేస్తారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే రౌడీలపై గూండాయాక్ట్‌, కోకా యాక్ట్‌, నగర బహిష్కరణ లాంటి కఠిన చర్యలు తీసుకుంటారు. 15 రోజులకు ఒకసారి రౌడీల వ్యవహారాలపై సమీక్ష చేస్తారు. ప్రజలను బెదిరించడం, వసూళ్లు, దోపిడీలు, ముఠా కలహాలు వంటి వాటికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. వారంరోజుల్లోగా దళాలను ఏర్పాటుచేసి తమ ఆఫీసుకు నివేదిక పంపాలని అన్ని నగరాల పోలీస్‌ కమిషనర్లు, ఐజీపీలు, జిల్లా ఎస్‌పీలకు ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement