హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని గుండ్లవద్దిగెరె గ్రామానికి చెందిన చంద్రయ్య స్వామి పొలంలో హోయ్సళుల కాలానికి చెందిన పురాతన శాసనం బయల్పడింది. గుండ్లవద్దిగెరె గ్రామ ఉపాధ్యాయులు మహాకాళప్ప, మల్లనగౌడ, గంగాధర్‌ల సహకారంతో తుమకూరు శశికుమార్ నాయక మార్గదర్శకత్వంలో, విజయనగర పరిశోధకుల బృందం సభ్యులు డాక్టర్ గోవింద, ప్రొఫెసర్ తిప్పేస్వామి, డాక్టర్ కృష్ణగౌడ, ఇస్మాయిల్ సిద్దిక్, అశోక్ తలేఖాన్ ఈ శాసనాన్ని కనుగొన్నారు. ఈ శాసనం ఒక గ్రానైట్ శిలపై రాయబడింది. 15 ఫంక్తుల ఈ శాసనం ఎనిమిది అడుగుల ఎత్తు, ఒకటిన్నర అడుగుల వెడల్పు ఉంది. రాజు పేరు మొదటి ఫంక్తిలోనే పేర్కొన్నారు. హోయ్సళ చక్రవర్తి నరసింహ పాలనా కాలంలో కాశీగడ్ గుండ్లవాడిని పరిపాలించింది. ఆయన ఒక చెరువును నిర్మించడమే కాకుండా దానికి భూమిని కూడా దానం చేశారు. దీనిని బట్టి ఈ జిల్లాను హోయ్సళ రాజులు పరిపాలించారని స్పష్టమవుతోందని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం చరిత్ర ప్రొఫెసర్ హెచ్.తిప్పేస్వామి అన్నారు.


