శివాజీనగర: ‘నేను ముఖ్యమంత్రిని అనేకంటే ముందు మీ ఇంటి కుమారున్ని. మీ సేవకున్ని. జీవితంలో ప్రయత్నాలు విఫలం కావచ్చు. అయితే భగవంతుని కృప, ప్రజల ఆశీర్వాదముంటే ప్రయత్నం ఫలిస్తుంది. అదే మాదిరిగా నేను ముఖ్యమంత్రిని కాగలిగాను’ అని సీఎం డీకే శివకుమార్ అన్నారు. సీఎం అయిన తరువాత ఆయన ఆదివారం తొలిసారిగా సొంత నియోజకవర్గమైన బెంగళూరు దక్షిణ (రామనగర) జిల్లాలోని కనకపురలో హారోహళ్ళిని సందర్శించారు. విధానసౌధ నుంచి సిల్స్ బోర్డు వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తూ అందులో జనంతో ముచ్చటించారు. మెట్రో రైలులో ప్రయాణికులు హాయిగా వెళ్తున్నారని, అది చూసి తనకు ప్రజలకు అనుకూలమైన రవాణా వ్యవస్థ ఎంత అవసరమనేది మరోసారి అర్థమైందన్నారు. బెంగళూరు తమందరికి గర్వకారణమని అన్నారు.
భారీ స్వాగతం
సిల్క్‌బోర్డులో దిగి కారులో కనకపురకు వెళ్లారు. సీఎం వాహనాలు కనకపుర సరిహద్దుల్లోకి ప్రవేశించగానే భారీఎత్తున టపాసులు పేల్చి ప్రజలు, అభిమానులు స్వాగతించారు. కోటే ఆంజనేయస్వామి ఆలయంలో డీకే పూజలు చేసి టాపు లేని వాహనంలో బయల్దేరారు. స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ తన మీద అభిమానంతో ఏదేదో మాట్లాడాడని చమత్కరించారు.
కనకపురలో మెడికల్ కాలేజీ..
రామనగరను ‘బెంగళూరు దక్షిణ జిల్లా’గా ప్రకటించడం చారిత్రక నిర్ణయమని డీకే అన్నారు. దీంతో ఇక్కడ భూముల విలువ గణనీయంగా పెరుగుతుందని, ఆర్థిక వికాసం మొదలవుతుందని చెప్పారు. కనకపురలో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో ఉన్నత విద్యాసంస్థలు, సౌకర్యాల కల్పనకు హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి 8 గంటలకు కనకపుర పట్టణంలోని చన్నబసప్ప సర్కిల్‌లో పర్యటనను ముగించారు.
సీఎం డీకే
శివకుమార్ వ్యాఖ్య
మెట్రో రైలులో ప్రయాణం
సొంత
నియోజకవర్గంలో పర్యటన


