హొసపేటె: నగరంలోని 9వ వార్డులోని సిద్దలింగప్ప చౌకి ప్రాంతంలోని రాజాజీనగర్‌లో రోడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల(డ్రైనేజీ) వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ లేక ఆ వార్డులోని 2వ క్రాస్ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు, మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణం పేరుతో ఈ ప్రాంతంలోని రోడ్డును తవ్వారు. తవ్విన రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంతో నిత్యం అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్డు తవ్వడం వల్ల ఈ ప్రాంత వాసుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేస్తామన్న సాకుతో ఇళ్ల ముందున్న మెట్లను కూడా తొలగించారు. ఆ ప్రాంతంలో నిర్మించిన మురుగు కాలువ కూడా అశాసీ్త్రయంగా ఉంది. మురుగునీటి ప్రవాహం సజావుగా లేదు. తాగునీటి పైప్‌లైన్ కూడా ఈ కాలువ గుండానే వెళుతోంది. దీంతో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. నిలిచిన మురుగునీటితో అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయనే భయం కూడా నెలకొంది. వర్షపు నీరు, మురుగునీరు ఇళ్లలోకి వస్తున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా మున్సిపల్ కౌన్సిలర్, అధికారులు సమస్యపై దృష్టి సారించాలని వార్డు వాసులు కోరారు.


