రాయచూరు రూరల్: నీటికుంటలో పడి ముగ్గురు మరణించిన ఘటన యాదగిరి జిల్లా వడగేర తాలూకా బసవనగర వద్ద జరిగింది. గ్రామ సమీపంలోని కుంటలో పడి ఇద్దరు బాలికలతో పాటు ఓ మహిళ మరణించిన ఘటన ఆదివారం జరిగింది. సూరత్–చైన్నె జాతీయ రహదారి పనుల కోసం లోతుగా మట్టిని తవ్వేశారు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురవడంతో వాననీరు ఆ కుంటలో నిలిచింది. అయితే దుస్తులు ఉతకడానికి వెళ్లిన శివలీల(10), సుజాత(10) అనే బాలికలు కుంటలో పడి బయటకు రాలేక కేకలు పెట్టారు. గమనించిన అక్కడకు సమీపంలో ఉన్న గుండమ్మ(35) అనే మహిళ వారిని కాపాడేందుకు ప్రయత్నించి ఆమె కూడా కుంటలో పడిపోయి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందిన వెంటనే ఎస్పీ పృథ్వీ శంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై వడగేర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


