రంగాపురం అనే గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు వుండేవాళ్ళు. ఇద్దరూ కలిసి బట్టల వ్యాపారం చేసేవాళ్లు. వ్యాపారానికి కావల్సిన పైకం ఒకరికొకరు సర్దుకునేవారు. వ్యాపారం అలా సాఫీగా సాగిపోతూ వచ్చింది.
కొద్దిరోజులు జరిగిన పిమ్మట రాము వ్యాపారంలో ఎక్కువ లాభాలు గడిస్తూ వచ్చాడు. అది సోముకు మింగుడు పడలేదు. ఎలాగైనా రాము చేసే వ్యాపారాన్ని దెబ్బతీయాలని పన్నాగం పన్నాడు.
ఒకరోజు ఇదరూ కలిసి వ్యాపార నిమిత్తం పల్లెలకు బయలుదేరి వెళ్ళారు. తిరిగి ఇంటికి వచ్చేపాటికి సాయంత్రం కావొచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఊరిలో జనాలు రాము బట్టలు నిల్వ చేసిన గోడౌన్ వద్దకు పరుగులు తీస్తున్నారు. తీరా వెళ్లి చూస్తే బట్టలు మొత్తం బూడిదైపోయాయి.
ఎవరో అగ్గి పెట్టారు. జరిగిన నష్టానికి రాము చింతించాడు. సోము ఓదార్చాడు. కొంతకాలం వ్యాపారానికి దూరమైనాడు రాము. కొన్నాళ్లు జరిగిన తర్వాత సోము అనారోగ్యంతో మంచాన పడ్డాడు. తన వ్యాపారం ఆగిపోయింది. డబ్బుతో చాలా ఇబ్బంది పడ్డాడు. అది గ్రహించిన రాము సోముకు ఆర్థిక సహాయం అందించి అనారోగ్యం నయం చేయించాడు. సోము మళ్లీ యథాప్రకారం వ్యాపారం మొదలు పెట్టాడు.
మరొక రోజు రాము ఇంటికి ఒక సంచి పట్టుకుని సోము వెళ్ళాడు. వెళ్లీ వెళ్లగానే సోము ఉన్నఫళంగా రాము కాళ్ళ మీద పడి బోరున విలపించాడు ‘ నన్ను క్షమించు మిత్రమా.. నీలో ఇంత మంచితనం వుందని గ్రహించలేకపోయాను. నువ్వు బాగుపడుతుంటే ఓర్వలేక పోయాను. మీ బట్టల నిల్వ వుంచిన గోడౌనుకు నేనే అగ్గి పెట్టించాను. నీ ఎదుగుదలను ఆపాలనుకున్నాను కానీ ఆపలేకపోయాను నీ మంచి మనసే నాకు ప్రాణబిక్ష పెట్టింది.. చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు ఐనా నేను వినలేదు ఫలితం అనుభవించాను ’ అంటూ పశ్చాత్తాపం చెంది. రాముకు నష్ట పరిహారం చెల్లించాడు సోము
‘మంచికి మంచి, చెడుకి చెడు ఉన్నాయి కాబట్టే మానవత్వం ఇంకా బతికుంది ’ అని సోముని క్షమించాడు రాము.
– నరెద్దుల
రాజారెడ్డి


