కామారెడ్డి అర్బన్: వర్షాకాలంలో భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉరుములు, మెరుపుల కారణంగా చెట్లు, కొమ్మలు విద్యుత్ తీగలపై పడే అవకాశం ఉన్నందున ప్రజలు విద్యుత్ ప్రమాదాలపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఈ సాలియా నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఎక్కడైన విద్యుత్ లైన్ తెగిపోవడం, చెట్ల కొమ్మలు పడిపోవడం కనిపిస్తే వెంటనే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. వ్యవసాయ బోరుబావుల వద్ద రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, సొంతగా మరమ్మతులు చేయొద్దని, టోల్‌ఫ్రీ నంబర్‌కు లేదా స్థానిక సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. 87124 81489 నంబర్ ద్వారా వాట్సాప్‌లో సైతం విద్యుత్ సేవలు పొందవచ్చని తెలిపారు. జీపీఆర్‌ఎస్ కలిగిన అత్యవసర మరమ్మతుల బృందం వాహనం, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
కామారెడ్డి టౌన్ : సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా చలామణి అవుతున్న సదరం క్యాంప్ తేదీల పోస్టర్ నకిలీదని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో) దామోదర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ‘జూన్ 14, 15, 21, 22 తేదీల్లో కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నారు’ అంటూ సాగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఫేక్ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు సదరం క్యాంపుల తేదీలు, నిర్వహించే స్థలం, సమయం తదితర పూర్తి వివరాలను వారు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మాత్రమే ఎస్‌ఎంఎస్ రూపంలో లేదా నేరుగా ఫోన్ కాల్ ద్వారా విద్యాశాఖ/డీఆర్‌డీఏ యంత్రాంగం తెలియజేస్తుందని స్పష్టం చేశారు.
17, 18 తేదీల్లో క్యాంపులు
ప్రతి నెలా బుధ, గురు వారాల్లో నెలలో 8 వరకు సదరం క్యాంపులు నిర్వహిస్తామని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆర్‌ఎంవో సంతోష్ తెలిపారు. ఈనెలలో 17, 18 తేదీల్లో సదరం క్యాంపును జీజీహెచ్‌లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 17న ఈఎన్‌టీ, మానసిక, 18న ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, పిల్లల విభాగం వారు వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని, 24, 25 తేదీల్లో సదరం క్యాంపు లేదని స్పష్టం చేశారు.
సుభాష్‌నగర్: ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రెడ్‌క్రాస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం నిర్వహించారు. అత్యధిక రక్తదానాలు చేయించినందుకు గాను నిజామాబాద్ సీపీ సాయిచైతన్య తరఫున ఏసీపీ ప్రకాశ్, జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్‌రెడ్డి తరఫున ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ అవార్డులను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా అందుకున్నారు. 87 సార్లు రక్తదానం చేసిన తోట రాజశేఖర్‌ను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, కోశాధికారి కరిపె రవీందర్, సభ్యుడు సూర్యనారాయణ పాల్గొన్నారు.


