● మద్నూర్–బోధన్ హైవే డీపీఆర్ సిద్ధం
● ఎంపీ సురేశ్ షెట్కార్
● సలాబత్‌పూర్ ఆలయంలో పూజలు
మద్నూర్(జుక్కల్): మద్నూర్‌లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. మండలంలోని సలాబత్‌పూర్‌లోని హనుమాన్ ఆలయాన్ని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కార్యాలయంలో ఎంపీ మాట్లాడుతూ.. మద్నూర్‌కు కేంద్రీయ విద్యాలయం మంజూరైనప్పటికీ ఐదు ఎకరాల స్థలం అవసరమని అన్నారు. వెంటనే ఆయన తహసీల్దార్ ముజీబ్‌కు ఫోన్ చేసి కేవీ కోసం స్థల సేకరణ ఎంత వరకు వచ్చిందని అడిగారు. స్థలం సిద్ధం చేయాలని, తాను అధికారులతో మాట్లాడి కేవీ ప్రారంభమయ్యేలా కృషి చేస్తానన్నారు. జహీరాబాద్‌లో 15 ఎకరాల స్థలంలో కేవీ ప్రారంభించామని ఎంపీ తెలిపారు. హనుమాన్ ఆలయంలో కల్యాణమండపం, అభివృద్ధి పనులు మధ్యలో నిలిచిపోయాని, ప్రహరీ లేకపోవడంతో పందులు, కుక్కలు లోనికి వస్తున్నాయని భక్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, త్వరలో పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటానన్నారు. మద్నూర్ – బోధన్ హైవే పనులపై ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోందని, బడ్జెట్, డిజైన్, విస్తరణ, మౌలిక వసతులు, సాంకేతిక అంశాలకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. మద్నూర్ మండల కేంద్రం నుంచి సిర్‌పూర్, నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్, కోటగిరి, రుద్రూర్ మీదుగా బోధన్ వరకు పనులు జరుగుతున్నాయని వివరించారు. కుర్లా సమీపంలో మంజీర నదిపై వంతెన తన హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. సర్పంచ్‌లు తుకారాం, దిగంబర్, మాధవ్‌రావ్, మాజీ జెడ్పీటీసీ సాహెబ్‌రావ్, మాజీ సర్పంచ్ గఫార్, నాయకులు నాగేశ్‌పటేల్, సచిన్ తదితరులున్నారు.


