ఇక నో ట్రాఫికర్‌ | - | Sakshi
Sakshi News home page

ఇక నో ట్రాఫికర్‌

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని యావర్‌రోడ్డు ఎన్‌హెచ్‌–63 కొత్తబస్టాండ్‌ రోడ్‌ నుంచి ధర్మపురి రోడ్‌ వరకు ఉంటుంది. ఇది ప్రధానంగా వాణిజ్యం, వ్యాపారాలు జరిగే ప్రాంతం. జగిత్యాల జిల్లాకేంద్రం కావడం.. పట్టణ జనాభా పెరగడం.. వ్యాపారాలు విస్తరించడంతో రోడ్డు ఇరుకుగా మారింది. ఈ క్రమంలో రోడ్డు విస్తరణ అనివార్యమైంది. అలాంటి రోడ్డును విస్తరించాలని గతంలో చాలాసార్లు అధికారులు, నాయకులు ప్రయత్నించినప్పటికీ అక్కడున్న వ్యాపారులు కోర్టులకు వెళ్లడం, అడ్డుకోవడం, ఇతరత్రా కారణలతో ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం 80 ఫీట్లు ఉన్న ఈ దారిని 100 ఫీట్లకు విస్తరిస్తే తప్ప ఇబ్బందులు తొలగేలా లేవు. జగిత్యాల మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచే ఇక్కడ ఇరుకై న రోడ్లు ఉన్నాయి. ఉద్యోగాలు, చదువుల నిమిత్తం వేలాది మంది వచ్చి ఇక్కడే స్థిరపడడంతో పట్టణం భారీగా విస్తరించింది.

ప్రభుత్వ కార్యాలయాలున్న చోట విస్తరణ

ఐదేళ్లకోమారు ప్రజాప్రతినిధులు మారుతున్నా.. జగిత్యాల రూపురేఖలు మారడం లేదు. డివిజన్‌ కేంద్రంగా ఉన్నప్పుడు యావర్‌రోడ్డు ఇరుకుగా ఉండటంతో గతంలో బైపాస్‌రోడ్‌ నిర్మించారు. ఆ బైపాస్‌రోడ్‌ కూడా పూర్తి ట్రాఫిక్‌గా మారిపోయింది. బైపాస్‌రోడ్‌ గతంలో 100 ఫీట్లు కాకుండా కేవలం 60 ఫీట్లు మాత్రమే వేయడంతో ఆ రోడ్డు ప్రస్తుతం ఇరుకుగా మారింది. అత్యధికంగా స్కూళ్లు, హోటల్స్‌, వాణిజ్య వ్యాపారాలు ఈ రోడ్డుపైనే వెలవడంతో ట్రాఫిక్‌ సమస్యగా మారింది. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ చర్యలు తీసుకుని యావర్‌రోడ్డుపై ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న చోట 100 ఫీట్ల వెడల్పు చేశారు. మిగతా ప్రాంతాల్లో కేసులు ఉండటంతో అలాగే ఉండిపోయాయి.

ఆక్రమణలు ఎక్కువే...

యావర్‌రోడ్డు 80 ఫీట్లు ఉండగా.. వ్యాపారులు రోడ్లను ఆక్రమించుకుని ఎలాంటి సెట్‌బ్యాక్‌ పాటించకుండా వ్యాపారాలు నిర్వహించడంతో ప్రజల రాకపోకలకు కష్టతరంగా మారుతోంది. కనీసం వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద విస్తరణ చేపట్టగా ఆ ఖాళీ స్థలాల్లో అత్యధిక హోటల్స్‌ వెలిశాయి. దీంతో అక్కడ అంతా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఇటీవలే కొందరు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణలను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

ఆక్రమణలను తొలగించాలని, యావర్‌రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ను కోరారు. యావర్‌రోడ్డును విస్తరించాలని, ఇందుకు నిధులు కేటాయించాలని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాకు రాగా వినతిపత్రం అందింశారు. సానుకూలంగా స్పందించిన సీఎం రోడ్డు విస్తరణ చేస్తామని హామీ ఇచ్చారు కూడా.

ఆక్రమణల తొలగింపులపై ఆరోపణలు

జిల్లాకేంద్రంలో యావర్‌రోడ్డుపైనే కాకుండా చాలా చోట్ల రోడ్లను ఆక్రమించుకుంటున్నారు. ఇటీవలే కొందరివి మాత్రమే తొలగించగా వారంతా అధికారులపై ఆగ్రహంగా ఉన్నారు. ఆక్రమణలు మొత్తం తొలగించాలని, కొందరివే తొలగించి పొట్టపై కొట్టొద్దని అంటున్నారు. దీనికి ముమ్మాటికీ రాజకీయ ఒత్తిళ్లే కారణమని పేర్కొంటున్నారు.

అన్ని ఇరుకై న రోడ్లే...

జిల్లా కేంద్రంలో ప్రధానమైన రోడ్లన్నీ ఇరుకుగానే ఉన్నాయి. 1983లో ఉన్న మాస్టర్‌ ప్లాన్‌ అమలు కావడంతో రోడ్లు అభివృద్ధి కావడం లేదు. మాస్టర్‌ ప్లాన్‌ అమలు కాకపోవడం, రోడ్డు విస్తరణ కాపోవడంతో జిల్లాలో ఇరుకై న రోడ్లతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరంగా మారింది. కనీసం పార్కింగ్‌ చేద్దామన్నా స్థలం లేని పరిస్థితి. ముఖ్యంగా పాతబస్టాండ్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఉండటంతో బస్సు తిరగలేని, ఆటోలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

యావర్‌రోడ్డు విస్తరణకు అడుగులు

ఫైల్‌ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు

అక్రమాలు తొలగించాలని కమిషనర్‌ను కోరిన ఎమ్మెల్యే

విస్తరణకు గతంలోనే హామీ ఇచ్చిన సీఎం

ఆక్రమణలు తొలగించండి

యావర్‌రోడ్‌లో ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ సత్యప్రణవ్‌కు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి వినతిపత్రం అందించారు. మిషన్‌ కాంపౌండ్‌ నుంచి కొత్తబస్టాండ్‌, మంచాల కృష్ణ పెట్రోల్‌బంక్‌ వరకు విస్తరించేందుకు యజమానుల పత్రాలు పరిశీలించి ఫైల్‌ సిద్ధం చేయాలని కోరారు. వ్యాపారులు రోడ్లను ఆక్రమించి పర్మినెంట్‌ షెడ్లు వేసుకున్న వాటిని తొలగించాలన్నారు. తోపుడుబండ్ల వ్యాపారాలను ముట్టుకోవద్దన్నారు. బీట్‌ చౌరస్తాలో నిర్మించిన సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లలో మటన్‌, కూరగాయలు పెట్టుకుని అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement