ప్రతిపాదనల్లోనే అంజన్న ప్రసాదం పెంపు | - | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనల్లోనే అంజన్న ప్రసాదం పెంపు

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

మల్యాల: భక్తుల కొంగుబంగారమై కొండగట్టు అంజన్న భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అందించే ఉచిత అన్నదానం రెట్టింపు చేయాలనే ప్రతిపాదన అమలుకు నోచుకోవడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అంజన్న అన్నప్రసాదం అందడం గగనంగా మారుతోంది. కొండగట్టుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నా.. కనీసం రెండు వందల మందికి కూడా సత్రంలో భోజనం అందడం లేదు. ఆలయ ఆదాయం పెరుగుతున్నా.. అధికారులు మాత్రం స్పందన లేకుండాపోతోంది.

స్థానికులకే భోజనం..

వాస్తవానికి కొండగట్టుకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించాల్సి ఉంది. అయితే స్థానికులే అధికంగా వినియోగించుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఉచిత అన్నదానం టోకెన్లు జారీ చేసే సమయంపై దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవగాహన లేకపోవడంతో వారికి భోజనం అందడంలేదు. మరోవైపు స్థానికులు టోకెన్లు ఇచ్చే సమయానికి వెళ్లి భోజనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సత్రంలో 100మందికి అన్నదాన టోకెన్లు ఇస్తున్నారు. మంగళవారం, శనివారం మాత్రం 200మందికి టోకెన్లు ఇస్తున్నారు. అన్నదానం టోకెన్లు ఎక్కడ జారీ చేస్తారో..? ఎప్పుడు జారీ చేస్తారో తెలియక చాలామంది భక్తులు అన్నదానానికి దూరమవుతున్నారు.

విరాళాల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్‌

కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తుల నుంచి విరాళాలు స్వీకరించేందుకు అధికారులు ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేశారు. విరాళాల స్వీకరణపై చూపించే శ్రద్ధ భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై చూపడం లేదనే విమర్శలున్నాయి. ఆలయానికి ప్రతిరోజూ సుమారు 2వేల నుండి 5 వేలమంది వరకు.. మంగళవారం, శనివారాల్లో సుమారు 5వేల నుండి 20వేల మందికిపైగా భక్తులు వస్తుంటారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఉచిత అన్నదానం టోకెన్లను నిత్యం 100 నుంచి 200కు.. మంగళవారం, శనివారం 200 నుంచి 400కు పెంచాలనే డిమాండ్‌ ఏళ్ల తరబడి వినిపిస్తున్నా అధికారులు ఆ దిశగా చొరవ చూపడం లేదు. రెండేళ్ల క్రితం ప్రతి పాదనలు చేసినప్పటికి నేటికీ ఆచరణలోకి రాలేదు.

కొండగట్టు ఆలయం

నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేస్తున్న భక్తులు

దూరప్రాంత భక్తులకు అందని అన్న ప్రసాదం

కేవలం వందమందికే సరిపెడుతున్న వైనం

తీవ్ర ఇబ్బంది పడుతున్న మిగిలిన భక్తులు

చొరవ చూపని అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement