హర్మూజ్ జలసంధి దిగ్బంధనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్‌ను శాశ్వతంగా తెరిచి ఉంచుతాం.. దీంతో చైనాతో పాటు ప్రపంచమంతా లాభపడుతుంది. మా నిర్ణయం పట్ల చైనా సంతోషంగా ఉంది. ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోమని చైనా చెప్పింది.’’ అంటూ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఈ కీలకమైన జలసంధి ఇకపై ఎన్నడూ మూతపడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అయితే, తాము ఇరాన్‌కు ఎలాంటి సైనిక సహకారం అందించడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత కొన్ని రోజులుగా పదేపదే ఖండిస్తోన్న సంగతి తెలిసిందే. చైనా చాలా కాలంగా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌కు మద్దతు ఇస్తోందని.. క్షిపణుల తయారీలో ఉపయోగపడే ద్వంద్వ-వినియోగ పారిశ్రామిక భాగాలను సరఫరా చేయడం ద్వారా ఇరాన్‌ను ప్రోత్సహిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది.
మరోవైపు, రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని.. త్వరలోనే ముగుస్తుందని నేను భావిస్తున్నాన్నారు. అయితే, ఇరాన్‌తో సంఘర్షణలో అమెరికా పని ఇంకా ముగియలేదు.
..కానీ, యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. నేను వెళ్లిపోతే ఇరాన్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు సమయం పడుతుంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే వారిని సర్ అని పిలవాల్సి వచ్చేంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.


