ఇరాన్, అమెరికా మధ్య చర్చల విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, ఇరాన్ తాజాగా చేసిన కొత్త ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అణ్వస్త్ర కార్యక్రమాన్ని మినహాయించి ఇరాన్‌తో చర్చలు జరపడంలో అర్థమే ఉండదని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని అడ్డుకోవడం లక్ష్యంగా ప్రారంభమైన నేపథ్యంలో దాని ప్రస్తావనే ఆలస్యం కావడంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి.
అయితే, శాంతి చర్చల్లో భాగంగా అమెరికాకు ఇరాన్ ఇటీవలే కొత్త ప్రతిపాదనలను పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా పంపించింది. ఇందులో భాగంగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం, హార్మూజ్ జలసంధిని తెరవడం అనేవి జరిగిన తర్వాతే తమ అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరుపుతామని ఇరాన్ తేల్చి చెప్పింది. మరోవైపు.. అణ్వస్త్ర కార్యక్రమంపై ఇరాన్‌తో చర్చలు ఫలప్రదమైన తర్వాతే మిగతా విషయాలపై ఫోకస్ పెడతామని అమెరికా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పంపిన నూతన ప్రతిపాదనలపై చర్చించేందుకు తన సలహాదారులతో ట్రంప్ తాజాగా సమావేశమైనట్లు తెలిసింది. అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరగనిదే, మిగతా అంశాలపై ఇరాన్‌తో చర్చలను మొదలుపెట్టలేమని ట్రంప్ తేల్చి చెప్పినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఇరాన్ ప్రతిపాదించిన క్రమంలో చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేమని ట్రంప్ స్పష్టం చేశారని పేర్కొన్నాయి.
ఇరాన్‌కు నో ఛాన్స్..
ఇరాన్‌తో శాంతి చర్చలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కో రూబియో తాజాగా ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ..‘ఇరాన్ ఇక ఏ దశలోనూ అణ్వాయుధాలను అభివృద్ధి చేయలేదని నిర్ధారించే ఒప్పందం కుదరాల్సిందే. ఈ విషయంలో ఇరాన్‌కు తప్పించుకునే అవకాశాన్ని ఇవ్వకూడదు. ఇరాన్ నుంచి దీనిపై అమెరికా ధ్రువీకరణ పొందాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో.. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల ప్రక్రియలో మరోసారి ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాలూ తమ షరతుల ప్రకారమే చర్చలు జరగాలని వాదిస్తున్నాయి. వాదనను నెగ్గించుకునే యత్నంలో అమెరికా, ఇరాన్ ఉండటంతో చర్చల ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు.
ఇరాన్ ప్రతిపాదనలు ఇవే...
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడం, మళ్లీ ఇరాన్‌పై దాడులు జరగవు అనే హామీలను పొందడం.
ఇరాన్ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపడం, హార్మూజ్ జలసంధిని తెరవడం.
మొదటి రెండు ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాక తమ అణ్వస్త్ర కార్యక్రమం, సంవర్ధిత యురేనియం హక్కులపై అమెరికాతో చర్చలను మొదలుపెడతామని ఇరాన్ ప్రతిపాదించింది.


