యూఏఈ సంచలన నిర్ణయం.. పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌! | UAE Reported Exit From OPEC Sparks Major Shake Up In Global Oil Politics And Regional Alliances | Sakshi
Sakshi News home page

యూఏఈ సంచలన నిర్ణయం.. పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌!

Apr 29 2026 8:13 AM | Updated on Apr 29 2026 10:36 AM

UAE Exit From OPEC Over Pakistan-Saudi Issue Effect

ఇరాన్‌, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న వేళ పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్‌ దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌-ఒపెక్‌ (OPEC), ఒపెక్‌+ (OPEC+) నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, దీనికి సౌదీ అరేబియా, పాకిస్తానే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు యూఏఈ ఊహించని షాకిచ్చింది.

కాగా, మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఒపెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని యూఏఈ తెలిపింది. మార్కెట్ డిమాండ్, పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచుతామని యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు ఇది అతిపెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంది.  

ఒపెక్‌కు ఝలక్‌..
1967లో యూఏఈ ఒపెక్‌ కూటమిలో చేరింది. ఒపెక్‌లో సౌదీ అరేబియా, ఇరాక్‌ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఒపెక్‌ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. సుదీర్ఘ కాలంపాటు సభ్యదేశంగా కొనసాగిన యూఏఈ.. అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. దీనివల్ల భవిష్యత్‌లో ఒపెక్‌ బలహీనం అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే హార్మూజ్‌ మూసివేతతో చమురు ఎగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒపెక్‌ దేశాలకు.. యూఏఈ రూపంలో మరో షాక్‌ తగిలింది. దేశ ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపినప్పటికీ సౌదీ, పాకిస్తానే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇరాన్‌ దాడులు కూడా ఇందులో మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

ఇరాన్‌ ఎఫెక్ట్‌.. 
ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా వంటి తన ప్రాంతీయ మిత్రదేశాలు సరైన రీతిలో స్పందించకపోవడం పట్ల యూఏఈ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఒపెక్‌ నుంచి యూఏఈ బయటకు వచ్చిందనే వాదన కూడా ఉంది. అలాగే, గల్ఫ్ ప్రాంతంలో యూఏఈ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా మారుతూ వచ్చాయి. ఇటీవల ఇరాన్‌ యుద్ధం దాడుల సందర్భంగా యూఏఈపై ఇరాన్ ఇటీవల 537 బాలిస్టిక్ క్షిపణులు, 26 క్రూయిజ్ మిసైళ్లు, 2,256 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడులు యూఏఈ మౌలిక వసతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ క్రమంలో అమెరికా మరియు ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై చర్యలు చేపట్టింది కానీ ప్రతిగా ఎక్కువ నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో పాకిస్తాన్‌ మధ్యవర్తి వ్యవహారంపై యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాకిస్తాన్ పాత్ర..

  • అమెరికా–ఇరాన్ మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ వ్యవహరించింది.

  • యూఏఈ మాత్రం పాకిస్తాన్ ఇరాన్‌పై కఠిన వైఖరి తీసుకోవాలని కోరింది.

  • పాకిస్తాన్ తటస్థంగా ఉండటంతో యూఏఈ అసంతృప్తి చెందింది.

  • ప్రతిగా యూఏఈ $3.5 బిలియన్ రుణం తక్షణమే తిరిగి చెల్లించమని డిమాండ్ చేసింది.

  • దీంతో, 2026 ఏప్రిల్‌లో పాకిస్తాన్ యూఏఈకి $3.45 బిలియన్ రుణం తిరిగి చెల్లించింది.

  • ఇందులో $1 బిలియన్ అబుదాబి ఫండ్ ఫర్ డెవలప్‌మెంట్‌కి చెల్లించబడింది.

  • ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మిగిలింది.

  • యూఏఈలో 1.6 మిలియన్‌కి పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారు.

  • వీరి రిమిటెన్సులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకం.

  • తాజాగా యూఏఈ, పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది పాకిస్తానీలకు ఎదురుదెబ్బ కానుంది.

సౌదీ-పాకిస్తాన్ బంధం..

  • యూఏఈ డిమాండ్‌ తర్వాత సౌదీ అరేబియా వెంటనే పాకిస్తాన్‌కు $3 బిలియన్ రుణం ఇచ్చింది.

  • అదనంగా $5 బిలియన్ క్రెడిట్ లైన్ వాగ్దానం చేసింది.

  • అంతకుముందు 2025లో సౌదీ–పాకిస్తాన్ రక్షణ ఒప్పందం కుదిరింది.

  • ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ తన అణు ఆయుధాలు, క్షిపణులు సౌదీ రక్షణ కోసం ఉపయోగించగలదు.

  • దీంతో, పాకిస్తాన్‌ తనను పక్కన పెట్టినట్లు యూఏఈ భావించింది.

యూఏఈ నిర్ణయం ప్రభావం..

  • ఆర్థికంగా: యూఏఈ ఇకపై రోజుకు 3 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోటా పరిమితులు లేకుండా పెంచుకోగలదు.

  • రాజకీయంగా: ఇది సౌదీ ఆధిపత్యానికి బహిరంగ సవాలు.

  • ప్రపంచవ్యాప్తంగా: అమెరికా, చైనా, రష్యా తమ వ్యూహాలను మళ్లీ ఆలోచించాల్సి వస్తుంది.

 

పశ్చిమాసియాలో యూఏఈ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తోంది. 2015లో ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడటానికి యూఏఈ, సౌదీ అరేబియా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే, యూఏఈ మద్దతు ఉన్న యెమెన్ వేర్పాటువాదులకు ఆయుధాల రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా బాంబు దాడి చేయడంతో కూటమిలో విభేదాలు తలెత్తాయి. కాలక్రమేణా రియాద్ కొన్ని వైఖరులకు విరుద్ధంగా ఉంది. గత కొన్నేళ్లుగా అమెరికా తన చమురు ఉత్పత్తిని పెంచుకోవడంతో వియన్నా కేంద్రంగా పనిచేసే 'ఒపెక్' మార్కెట్ పవర్ క్రమంగా తగ్గుముఖం పట్టింది.

ఇదిలా ఉండగా.. యూఏఈకి భారత్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. అయితే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. వారి మధ్య త్రైపాక్షిక సైనిక ఒప్పందంపై చర్చ జరుగుతోంది.

భారత్‌కి అవకాశాలు:

  • తక్కువ ధరలు: యూఏఈ ఉత్పత్తి కోటాల నుండి విముక్తి పొందడంతో రోజుకు 4.8 మిలియన్ బ్యారెల్స్ వరకు ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్లో సరఫరా పెంచి ధరలను తగ్గిస్తుంది.

  • దిగుమతి బిల్లు తగ్గింపు: భారత్‌కి క్రూడ్ ఆయిల్ దిగుమతి ఖర్చు తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.

  • ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది, ఇది వినియోగదారులకు నేరుగా లాభం జరుగుతుంది.

  • 2022లో భారత్ యూఏఈ నుండి $11 బిలియన్ విలువైన క్రూడ్ దిగుమతి చేసుకోగా, 2026లో ఇది $14 బిలియన్‌కి పెరిగింది.

  • యూఏఈ వాటా భారత్ క్రూడ్ దిగుమతుల్లో 10.3% నుండి 11.4%కి పెరిగింది.

  • దీర్ఘకాల ఒప్పందాలు: ఒపెక్‌ కోటాల పరిమితులు లేకుండా భారత్ యూఏఈతో దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. యూఏఈతో ఎనర్జీ భాగస్వామ్యం మరింత బలపడుతుంది. LNG, LPG రంగాల్లో కూడా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.
     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement