సరిగ్గా నలభై ఏళ్ల కిందట. 1986, ఏప్రిల్ 26 అర్ధరాత్రి దాటింది. అప్పటి సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న ఉక్రెయిన్‌లోని ‘ప్రిప్యాత్’ నగరం గాఢ నిద్రలో ఉంది. ఆ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలోని నాలుగో నంబరు యూనిట్‌లో నిపుణులు ఒక ప్రమాదకరమైన ప్రయోగానికి తెరలేపారు. ఆ ప్రయోగమే ఆధునిక మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన అణు విపత్తుకు దారితీస్తుందని వారెవరూ ఊహించలేదు.
విద్యుత్ సరఫరా నిలిచిపోతే, టర్బైన్లు తిరిగే వేగంతో రక్షణ వ్యవస్థలను ఎంతసేపు నడపవచ్చో చూడటమే ఈ పరీక్ష ఉద్దేశం. ఏప్రిల్ 25 తెల్లవారుజాము నుండే దీనికి సన్నాహాలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 2:00 గంటలకు అత్యవసర కోర్ కూలింగ్ వ్యవస్థను నిలిపివేశారు. అయితే, స్థానిక గ్రిడ్ నుండి విద్యుత్ డిమాండ్ రావడంతో ప్రయోగాన్ని తొమ్మిది గంటల పాటు వాయిదా వేశారు. ఈ విరామంలో రియాక్టర్ అస్థిరంగా మారింది. రాత్రి 11:00 గంటల తర్వాత మళ్ళీ ప్రయోగాన్ని మొదలుపెట్టారు. రియాక్టరును కేవలం 7 శాతం తక్కువ విద్యుత్తుతో నడిపారు. ఇదో పొరపాటుగా పరిణమించింది. పవర్ సామర్థ్యం పడిపోవడంతో దానిని పెంచడానికి ఆపరేటర్లు కంట్రోల్ రాడ్స్‌ను రియాక్టర్ కోర్ నుండి బయటకు తీశారు. ఇలా చేయడం వల్ల రియాక్టర్ అదుపు తప్పే ప్రమాదమున్నా పట్టించుకోలేదు.
విస్ఫోటనం
ఏప్రిల్ 26 తెల్లవారుజామున 1:23 గంటలకు ప్రయోగం అసలు దశకు చేరుకుంది. ఆపరేటర్లు టర్బై¯Œ కు వెళ్లే ఆవిరిని నిలిపివేశారు. ఫలితంగా సర్క్యులేషన్ పంపులు నిదానమవ్వడంతో రియాక్టర్‌ను చల్లబరచే వ్యవస్థ క్షీణించింది. దీనివల్ల రియాక్టర్‌లోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన సూపర్వైజర్, రియాక్టర్‌ను ఆపివేయడానికి ‘స్క్రామ్’ ఆదేశాన్ని ఇచ్చాడు. దీని ప్రకారం కంట్రోల్ రాడ్స్ అన్నింటినీ ఒకేసారి కోర్‌లోకి పంపాలి. కానీ, అప్పటికే రియాక్టర్ విపరీతంగా వేడెక్కడం వల్ల ఆ కడ్డీలు లోపలికి వెళ్లలేకపోయాయి. కేవలం మూడు సెకన్లలోనే రియాక్టర్ పవర్ అసాధారణంగా పెరిగింది.
లోపల ఏర్పడిన భారీ ఆవిరి పీడనం వల్ల వరుసగా రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ధాటికి రియాక్టర్‌కు ఉన్న వెయ్యి టన్నుల బరువున్న స్టీల్, కాంక్రీట్ మూత గాలిలోకి ఎగిరిపడింది. భవనం పైకప్పు కుప్పకూలిపోయింది. హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబుల కంటే వందల రెట్లు ఎక్కువ రేడియేషన్ గాలిలో కలిసింది. మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ ప్రాణాంతకమైన రేడియేషన్ ఉందని తెలియదు. ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా పనిచేశారు. ఫలితంగా వారిలో చాలామంది తీవ్రమైన రేడియేషన్‌కు గురై కొద్ది రోజుల్లోనే ప్రాణాలు విడిచారు.
ఈ విషపూరిత మేఘాలు గాలి దిశను బట్టి వ్యాపించాయి. సుమారు 1,50,000 చదరపు కిలోమీటర్ల మేర భూమి కలుషితమైంది. స్వీడన్‌లోని అణు పర్యవేక్షణ కేంద్రాలు తమ దేశంలో రేడియేషన్ స్థాయి పెరగడాన్ని గమనించి నిలదీసేవరకు సోవియట్ ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు, అంటే ఏప్రిల్ 27న ప్రిప్యాత్ నగరంలోని 30,000 మంది ప్రజలను హుటాహుటిన ఖాళీ చేయించారు. సుమారు 84 లక్షల ప్రజలు రేడియేషన్ బారిన పడ్డారు. వేల సంఖ్యలో ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడ్డారు. లక్షలాది ఎకరాల అడవులు, వ్యవసాయ భూములు విషపూరితంగా మారాయి.
పశువులు అంగవైకల్యంతో పుట్టడం ఈ విపత్తు తీవ్రతకు అద్దం పట్టింది. ఆ ప్రాంతంలోని అడవి చెట్లు రేడియేషన్ వల్ల ఎర్రగా మారిపోవడంతో దానికి ‘రెడ్ ఫారెస్ట్’ అని పేరు వచ్చింది. ప్రస్తుతం చెర్నోబిల్, ప్రిప్యాత్ పరిమిత టూరిస్టు కేంద్రాలుగా మారాయి. చెర్నోబిల్ ఉదంతం తరువాత ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అనుమానపు నీడలు ముసురుకున్నాయి. అయినా ఎన్నో కొత్త కేంద్రాలు ప్రారంభించి మానవాళి జాగరూకతతో ముందుకు పోతూనే ఉంది.
-ఎడిటోరియల్ టీమ్.


