పారిస్: ఫ్రాన్స్‌లో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. రెండు దేశాలు ఉమ్మడి విలువలు, ఉమ్మడి ప్రయోజనాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు.
భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం భద్రత నుంచి స్థిరమైన అభివృద్ధి వరకు విస్తరించిందని ప్రధాని మోదీ అన్నారు. “ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌దే. ఈ ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ ఆగదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. స్టార్టప్‌ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. భారత్‌తో కలిసి పనిచేయండి.
ప్రపంచం కోసం సాంకేతికను అభివృద్ధి చేయండి. భారత్ వేగంగా, విస్తృత స్థాయిలో ఆవిష్కరణలు చేస్తోంది. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణలు చేస్తోంది. ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తోంది.
సాంకేతికత, ఆవిష్కరణలు, విధానాలు అన్నీ మనుషుల అవసరాలు, సంక్షేమం, జీవన నాణ్యతను మెరుగుపరచడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నాం. ఆవిష్కరణ భారత్ డీఎన్‌ఏలో ఉంది. గత 12 ఏళ్లలో భారత్ బలమైన ఆవిష్కరణ వ్యవస్థను నిర్మించింది.
భారత్-ఫ్రాన్స్ మధ్య ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. ఇందులో నమ్మకం, ఆవిష్కరణ, స్ఫూర్తి, ఉమ్మడి దార్శనికత ఉన్నాయి. భారత్ యువ ఆవిష్కర్తలు మానవాళి మొత్తానికి ఉపయోగపడే వాటిని కనుగొంటున్నారు” అని ప్రధాని మోదీ చెప్పారు.
భారత్‌పై మెక్రాన్ ప్రశంసల జల్లు
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత్ ఆవిష్కరణ వ్యవస్థను ప్రశంసించారు. భారత్ తమ దేశంలో నిర్వహించిన తొలి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.
“భారత్ ఆవిష్కరణలు చేస్తోందా లేదా అన్నది ప్రశ్న కాదు. భారత్‌తో కలిసి ఎవరు ఆవిష్కరణలు చేస్తారు అన్నదే అసలు ప్రశ్న” అని మాక్రాన్ అన్నారు. భారత్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు ఆతిథ్యం ఇవ్వడం ఫ్రాన్స్‌కు గర్వకారణమని చెప్పారు.
భారత్ సాంకేతిక విజయాలను ప్రస్తావిస్తూ చంద్రయాన్ - 3 ల్యాండింగ్ విజయాన్ని ఉదాహరణగా చూపించారు. ఆ మిషన్ భారత్ ఆవిష్కరణ శక్తి, అమలు సామర్థ్యం, పారిశ్రామిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిందని అన్నారు. “పరిశోధన, ఆవిష్కరణ, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా ముందుకెళ్తోంది. ప్రపంచ ఆవిష్కరణ నాయక దేశంగా అవతరిస్తోంది” అని మాక్రాన్ చెప్పారు.
కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పు వంటి కీలక రంగాల్లో భారత్-ఫ్రాన్స్ మధ్య నిజమైన భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర అణుశక్తి రంగంలో, ముఖ్యంగా చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్ల విషయంలో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని చెప్పారు.


