రాడార్లకు చిక్కకుండా ఇరాన్‌కు చైనా విమానాలు..? | mystery Depens as four cargo planes vanish from radar in west asia | Sakshi
Sakshi News home page

రాడార్లకు చిక్కకుండా ఇరాన్‌కు చైనా విమానాలు..?

Apr 18 2026 5:49 PM | Updated on Apr 18 2026 6:36 PM

mystery Depens as four cargo planes vanish from radar in west asia

ఇటీవల అమెరికా సీక్రెట్‌ ఏజెన్సీలు చైనాపై సంచలన ఆరోపణలు చేశాయి. ఇరాన్‌కు యుద్ధంలో చైనా సహకరిస్తోందని ఆ దేశానికి పరోక్షంగా ఆయుధాలు అందజేస్తుందన్నాయి. అయితే ఈ ఆరోపణల్ని చైనా ఖండించింది. తాజాగా మధ్యప్రాచ్యంలో నాలుగు చైనా కార్గో విమానాలు రాడార్లకు చిక్కకుండా అదృశ్యమయ్యాయని నివేదికలు తెలిపాయి. ఈ ఆరోపణలు ఇప్పుడు ఆందోళనకరంగా మారాయి. 

కొద్దిరోజుల క్రితం అమెరికా నిఘా వర్గాలు ఇరాన్‌కు చైనా భారీగా మ్యాన్‌పాడ్‌ ఆయుధాలను తరలిస్తోందని ఆరోపించాయి. మ్యాన్‌పాడ్‌ అంటే భుజంపై ఎక్కడికైనా మోసుకెళ్లగల ఆయుధాలు. వీటిసాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను సులభంగా కూల్చివేయవచ్చు. ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఇవి ఎంతో కీలకంగా పనిచేశాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని నివేదికలు అమెరికా సీక్రెట్‌ ఏజెన్సీల సర్వేలకు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.


చైనా కార్గో విమానాలు

కొన్నిరోజుల క్రితం.. కేవలం 48 గంటల వ్యవధిలో నాలుగు చైనా కార్గో విమానాలు తమ ట్రాన్స్‌పాండర్లను ఆపివేసి చైనా భూభాగంలో దిగాయని పలు నివేదికలు కథనాలు ప్రచురించాయి. ట్రాన్స్‌పాండర్‌ అనేది సాధారణంగా విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది. ఎంత వేగంతో వెళుతుంది అనే వివరాలని ప్రసారం చేసే ఒక పరికరం. దీనిని ఉద్దేశపూర్వకంగా ఆపివేయడాన్ని డార్క్‌ ఫ్లైట్‌ అంటారు. సాధారణంగా వెళ్లే గమ్యం వెల్లడించకుండా ఉండడానికి సైనిక కార్యకలాపాలు, రహస్య లావాదేవీల సమయంలో ఇటువంటి పద్దతులను ఉపయోగిస్తారు.


ఆయుధాల తరలింపు?

అయితే కొన్ని సామాజిక మాధ్యమాల కథనాల ప్రకారం.. ఆ విమానాలు ఇరాన్‌కు ఆయుధాలు తరలించడానికి ఉద్దేశించినవని  అందులో మందుగుండు సామాగ్రితో పాటు ఇతర ఆయుధాలు తరలిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను చైనా ఖండించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే చైనా, అమెరికా ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమ దేశం బాధ్యతాయుతమైన దేశమని యుద్ధాన్ని ప్రోత్సహించే ఏ పనులు తాము చేయమని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ నివేదికలు రావడం ఆందోళన కలిగించే అంశం.

అయితే ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరో దఫా చర్చలకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా  ఈ రకమైన నివేదికలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement