‘అధిపత్యం కాదు..’ ట్రంప్‌కు కింగ్ చార్లెస్ చురక! | King Charles III Urges Responsibility Over Dominance In Subtle Message During US Independence Anniversary Speech | Sakshi
Sakshi News home page

‘అధిపత్యం కాదు..’ ట్రంప్‌కు కింగ్ చార్లెస్ చురక!

Apr 29 2026 8:26 AM | Updated on Apr 29 2026 10:35 AM

King Charles Bold Address to US Congress

వాషింగ్టన్‌: అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 వసంతాలు పూర్తవుతున్న వేళ.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక మైత్రీబంధాన్ని ఆకాశానికెత్తిన ఆయన.. అదే సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై సున్నితంగా, పరోక్షంగా చురకలు అంటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

‘ఆధిపత్యం కాదు.. బాధ్యత ముఖ్యం’
మానవ చరిత్రలోనే అత్యంత బలమైన, పరిణామాత్మక భాగస్వామ్యాల్లో అమెరికా-బ్రిటన్ మైత్రి ఒకటని రాజు కొనియాడారు. అయితే, దేశాలు కేవలం అంతర్ముఖంగా (ఇన్‌వర్డ్-లుకింగ్) మారొద్దని హెచ్చరించారు. ప్రపంచ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన బాధ్యతను అమెరికా నాయకత్వానికి గుర్తుచేశారు. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యల నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని, నాటో కూటమిని బలోపేతం చేయాలని ఆయన  కోరారు. అంతేకాకుండా, మత సామరస్యం, వాతావరణ మార్పుల కట్టడిపై ట్రంప్ విధానాలకు భిన్నంగా రాజు తన గళాన్ని వినిపించారు.

నియంతృత్వానికి చెక్.. పరోక్ష విమర్శలు
కార్యాచరణ అధికారాలపై సమతౌల్యం, నియంత్రణలు (చెకస్ అండ్ బ్యాలెన్సెస్) ఉండాలంటూ 1215 నాటి ‘మాగ్నా కార్టా’ను చార్లెస్ ప్రస్తావించడం విశేషం. ఇది ‘నా సొంత నైతికతే నాకు హద్దు’ అని ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలకు పరోక్ష కౌంటర్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఇరు దేశాల రాజకీయాలను కుదిపేసిన జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణాన్ని పేరు చెప్పకుండానే ప్రస్తావిస్తూ.. సమాజంలోని దురాచారాల బాధితులకు అండగా నిలవాల్సిన సామూహిక బలాన్ని ఆయన నొక్కిచెప్పారు.

అట్టహాసంగా అధికారిక పర్యటన
వాణిజ్య, విదేశాంగ విధానాలపరంగా విభేదాలు ఉన్నప్పటికీ, నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కింగ్ చార్లెస్, క్వీన్ కమీల్లాలకు వైట్‌హౌస్‌లో ఘన స్వాగతం లభించింది. టెక్ దిగ్గజాలు జెఫ్ బెజోస్, టిమ్ కుక్ సహా 130 మంది ప్రముఖులతో కలిసి ట్రంప్ దంపతులు వీరికి స్టేట్ డిన్నర్ (అధికారిక విందు) ఏర్పాటు చేశారు. కాగా, 1991లో క్వీన్ ఎలిజబెత్-II తర్వాత కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించిన రెండో బ్రిటిష్ చక్రవర్తిగా చార్లెస్ చరిత్ర సృష్టించారు. ఇటీవల ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు
ఇరాన్ యుద్ధం విషయంలో బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ అనుసరిస్తున్న వ్యూహాలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డిజిటల్ సేవల పన్ను రద్దు చేయకపోతే బ్రిటన్‌పై భారీ టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరిస్తున్న తరుణంలో ఈ పర్యటన జరగడం గమనార్హం. అయినప్పటికీ, కింగ్ చార్లెస్ చేసిన సున్నితమైన విమర్శలను పక్కనపెట్టి, ట్రంప్ ఈ ప్రసంగాన్ని ‘అద్భుతం’ అని ప్రశంసించడంతో పాటు.. ప్రసంగం చూసి నాకే అసూయ వేసింది అని సరదాగా వ్యాఖ్యానించడం విశేషం.

ఇది కూడా చదవండి: ఎగ్జిట్ పోల్స్ నిజమేనా? ‘ఈసీఐ’ ఏమంటోంది?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement