ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధంలో కీలక పరిణామం | israel deployed iron dome to uae amid iran war | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధంలో కీలక పరిణామం

Apr 27 2026 6:49 PM | Updated on Apr 27 2026 6:53 PM

israel deployed iron dome to uae amid iran war

అబుదాబి: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌ దాడుల నుంచి సురక్షితంగా ఉండేందుకు యూఏఈ చర్యలకు ఉపక్రమించింది. ఇజ్రాయెల్ అందించిన ‘ఐరన్ డోమ్’ను యూఏఈ మోహరించింది. ఇరాన్ నుంచి పెరుగుతున్న డ్రోన్, క్షిపణి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, యూఏఈ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. అబ్రహాం ఒప్పందాల తర్వాత రెండు దేశాలు రక్షణ రంగంలో సహకారం పెంచుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా, యూఏఈలో ఐరన్ డోమ్ వ్యవస్థను అమలు చేయడం ద్వారా ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది.  

రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ 4–70 కిలోమీటర్ల పరిధిలోని రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లను అడ్డుకుంటుంది. మిర్ ఇంటర్‌సెప్టర్ అనే క్షిపణులు లక్ష్యాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తాయి. ఎల్టా సిస్టమ్స్ రాడార్ ద్వారా వచ్చే ముప్పులను గుర్తించి, వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఇజ్రాయెల్‌లో ఈ వ్యవస్థ 90శాతం విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ గత కొన్నేళ్లుగా యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలపై డ్రోన్ దాడులు జరిపింది. 2025లో యూఏఈపై జరిగిన దాడుల్లో 2,200కి పైగా డ్రోన్లు ఉపయోగించింది. ఈ నేపథ్యంలో యూఏఈలో ఐరన్ డోమ్‌ను వినియోగంలోకి తెచ్చింది. 

యూఏఈ ఇప్పటికే అమెరికా నుంచి పాట్రియట్, థాడ్ రక్షణ వ్యవస్థలను పొందింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చేరడంతో యూఏఈ రక్షణ మరింత బలపడనుంది. అమెరికా,ఇజ్రాయెల్,యూఏఈ త్రైపాక్షిక సహకారం ఇరాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతుంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్,యూఏఈ,అమెరికా బలమైన కూటమి ఏర్పడుతోంది.
 
తాజా పరిణామంతో యూఏఈలోని చమురు, వాణిజ్య కేంద్రాలు ఇప్పుడు మరింత రక్షణగా ఉండనున్నాయి. ఇరాన్ దాడులు కొనసాగితే, ఐరన్ డోమ్ వ్యవస్థ యూఏఈ భద్రతకు కీలకంగా మారుతుంది. మొత్తం మీద, యూఏఈలో ఐరన్ డోమ్ అమలు కేవలం రక్షణ చర్య మాత్రమే కాదు .. ఇరాన్ ముప్పు పెరుగుతున్న ఈ సమయంలో, యూఏఈ భద్రతా వ్యూహంలో కీలక మలుపేనని నిపుణులు భావిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement