సందిగ్ధంలో చర్చలు!  | Iran says it has no plans to send negotiators to Pakistan | Sakshi
Sakshi News home page

సందిగ్ధంలో చర్చలు! 

Apr 21 2026 3:57 AM | Updated on Apr 21 2026 6:07 AM

Iran says it has no plans to send negotiators to Pakistan

గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో ఇరాన్‌ నౌకపై దాడిచేసి స్వాధీనం చేసుకున్న అమెరికా 

ప్రతిగా డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్‌ 

రెండో దఫా చర్చలకు బృందాన్ని పంపుతున్న అమెరికా 

హార్మూజ్‌ దిగ్బంధం, తమ నౌకపై దాడితో చర్చలకు రాబోమన్న ఇరాన్‌ 

చర్చలకు రావాలని ఇరాన్‌కు నచ్చజెప్తున్న పాకిస్తాన్‌ 

రేపటితో ముగుస్తున్న కాల్పుల విరమణ గడువు

టెహ్రాన్‌/వాషింగ్టన్‌/ఇస్లామాబాద్‌/దుబాయ్‌: తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటనతో పశ్చిమాసియాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇరాన్‌–అమెరికా యుద్ధంలో రెండో దశ శాంతి చర్చలు ముందుకుసాగడం ప్రశ్నార్థకంగా మారింది. తమ అ«దీనంలో ఉన్న హార్మూజ్‌ జలసంధిని అమెరికా హఠాత్తుగా దిగ్బంధించడంతో ఇప్పటికే గుర్రుమీదున్న ఇరాన్‌ ఆదివారం తమ వాణిజ్య నౌకపై అగ్రరాజ్య నావికాదళం దాడిచేసి స్వాధీనం చేసుకోవడంతో పట్టరాని ఆవేశంతో ఊగిపోతోంది. 

దీంతో అమెరికాతో రెండో దఫా చర్చలకు కూర్చునేదేలేదని తెగేసి చెప్పింది. ‘‘రెండువారాల కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘించింది. హార్మూజ్‌ను దిగ్బంధించింది. మా ‘తౌస్కా’ కార్గో నౌకపై దాడి చేసి స్వా«దీనంచేసుకుంది. అందుకే మా బృందాన్ని ఇస్లామాబాద్‌కు పంపట్లేదు. శుద్ధిచేసిన యురేనియంను అప్పగించడంపై ఏనాడూ అమెరికాతో చర్చించలేదు’’ అని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘేల్‌ సోమవారం స్పష్టంచేశారు. 

దీంతో ఇప్పటికే రెండో దశ చర్చలకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన పాకిస్తాన్‌ వెనువెంటనే రంగంలోకి దిగింది. అటు ఇరాన్‌ను బ్రతిమాలుతూనే హార్మూజ్‌ దిగ్బంధం, నౌకపై దాడి అంశాల్లో పట్టువిడుపులు ఉండాలని అమెరికాకు హితబోధ చేస్తోంది. చర్చల కోసం ఈజిప్ట్‌ సైతం ఇరాన్‌ను ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నంచేస్తోంది. దీంతో చర్చలకు యత్నాలు ఏమేరకు ఫలిస్తాయో, అవి నేటి చర్చల్లో ఏ స్థాయిలో ప్రతిఫలిస్తాయో చూడాల్సిందే. 

హెచ్చరిక, దాడి, స్వా«దీనం.. 
హార్మూజ్‌ జలసంధిని దిగ్బంధించడంతోపాటు తమ నౌకాశ్రయాల మీదుగా ఏ ఒక్క నౌక బయల్దేరకుండా అడ్డుకుంటూ అమెరికా చేస్తున్న చేష్టలతో ఇరాన్‌కు చిర్రెత్తుకొస్తోంది. దీనికి తోడు ఆదివారం గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో హార్మూజ్‌ దిశగా వస్తున్న 900 అడుగుల పొడవైన భారీ ఇరాన్‌ వాణిజ్య నౌక ‘తౌస్కా’ను అమెరికా ఆదివారం స్వా«దీనంచేసుకుంది.  ఇరాన్‌లోని బందాస్‌ అబ్బాస్‌పోర్ట్‌కు వెళ్లేందుకు దుస్సాహసం చేయకుండా తక్షణం ఉన్నచోటే ఆగిపోవాలని తొలుత అమెరికా నావికాదళాలు హెచ్చరించాయి. 

దాదాపు ఆరుగంటలపాటు ఈ హెచ్చరికలు చేశారు. అయినా సరే తౌస్కా అలాగే ప్రయాణాన్ని కొనసాగించడంతో అమెరికా గైడెడ్‌ మిస్సైల్‌ విధ్వంసక నౌక ‘యూఎస్‌ఎస్‌ స్పుయెన్స్‌’ దాడిచేసింది. తౌస్కాలోని ఇంజిన్‌ రూమ్‌పైకి కాల్పులు జరిపింది. తర్వాత యూఎస్‌ఎస్‌ ట్రిపోలీ నౌక, హెలికాప్టర్లలో అమెరికా నావికాదళాలు ‘తౌస్కా’ను సమీపించి స్వాదీనం చేసుకున్నాయి. తమ నౌకను అమెరికా స్వాదీనం చేసుకుందన్న వార్త తెల్సి ఇరాన్‌ ప్రతిదాడికి దిగింది. ఒమన్‌ సముద్రంలో ఉన్న అమెరికా నౌకలపైకి డ్రోన్ల దండును పంపి దాడిచేసింది.   

గడువు పొడిగించబోను: ట్రంప్‌ 
తాత్కాలిక కాల్పుల విరమణ గడువును పొడిగించబోనని సోమవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పునరుద్ఘాటించారు. ఇరాన్‌ ప్రతినిధి బృందం ఇంకా పాకిస్తాన్‌కు రాని నేపథ్యంలో రెండో దఫా చర్చలపై సందిగ్ధం నెలకొన్న వేళ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. ‘‘ అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రంతో తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగుస్తుంది. ఆలోపు ఇరాన్‌ మాతో శాంతిచర్చలు పూర్తిచేసి ఒప్పందం కుదుర్చుకోవాలి. గడువును పొడిగించడం అనేది దాదాపు అసాధ్యం.

 ఒప్పందం కుదరకపోతే దాడులు తథ్యం’’ అని ట్రంప్‌ అన్నారు. దీనిపై ఇరాన్‌ స్పందించింది. ‘‘అసంబద్ధ, అతి డిమాండ్లతో అమెరికా చర్చల ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేసింది. అలాంటి అమెరికాతో మరోసారి చర్చలకు సిద్ధపడబోం. అమెరికా దౌత్యమోసానికి మేం బలికాబోం’’ అని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ వ్యాఖ్యానించారు. గడువు పొడిగించబోనని ట్రంప్‌ ప్రకటించిన కొద్దిసేపటికే పెజెష్కియాన్‌ మాట్లాడటం గమనార్హం. చర్చల కోసం అమెరికా బృందం మంగళవారం పాకిస్తాన్‌కు బయల్దేరే ఆస్కారముంది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధృవీకరించలేదు. 

ఇరాన్, పాక్‌ మంతనాలు 
చర్చలకు ప్రతినిధి బృందాలను పంపాలని ఇరాన్‌ను పాక్‌ కోరింది. ఈ మేరకు సోమవారం ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీతో పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ మాట్లాడారు. చర్చల పర్వం మరింత మందుకు సాగాల్సిన ఆవశ్యకతను అరాఘ్చీకి ఇషాక్‌ వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement