ఓడరేవుల దిగ్బంధం తొలగేదాకా చర్చలుండవని వెల్లడి
ఇస్లామాబాద్‌కు ఇప్పటికే మా బృందం బయల్దేరుతోంది
ఒప్పందానికి రాకుంటే నాశనమే
వంతెనలు, ప్లాంట్లు ధ్వంసమే
ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు
వాషింగ్టన్: రెండో విడత చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ఆదివారం ఈ దిశగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయని తొలుత ట్రంప్ ప్రకటించారు. తమ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ సోమవారం సాయంత్రంకల్లా ఇస్లామాబాద్ చేరతారన్నారు. వాటిలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాల్గొంటారని అనంతరం వైట్‌హోస్ పేర్కొంది. అనంతరం ఇరాన్ స్పందిస్తూ, తాము ఈ చర్చల్లో పాల్గొనబోమని స్పష్టం చేసింది.
అమెరికా తమ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగించినంత కాలం ఎలాంటి చర్చలనూ అంగీకరించబోమని కుండబద్దలు కొట్టింది. ఆ దేశ అధికార వర్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ ఈ మేరకు వెల్లడించింది. శాంతి ఒప్పందానికి ఇరాన్ ముందుకు రాకపోతే ఆ దేశంలోని వంతెనలు, విద్యుదుత్పత్తి ప్లాంట్లను నామరూపాల్లేకుండా ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ గడువు ఈ నెల 22తో ముగియనుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల ఇస్లామాబాద్‌లోనే జరిగిన చర్చలు విఫలం కావడం తెలిసిందే. అణు కార్యక్రమాన్ని శాశ్వతంగా పక్కన పెట్టాలన్న అమెరికా డిమాండ్‌కు ఇరాన్ అంగీకరించలేదు.
విరమణకు ఇరాన్ తూట్లు: ట్రంప్
హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఐఆర్‌జీసీ కాల్పులు జరపడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని మండిపడ్డారు. ‘‘మేము న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం. ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నా. లేదంటే ఇకపై మేం ఎంతమాత్రం మంచివాళ్లం కాదు.’’ అన్నారు.
హార్మూజ్ ఉద్రిక్తం
హార్మూజ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. హార్మూజ్‌లో శనివారం భారత్ సహా పలు దేశాల నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
అసంబద్ధ డిమాండ్ల వల్లే: ఇరాన్
అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది.
బయటకు వెళ్లిపో!
హార్మూజ్ జలసంధిలో రెండు భారత నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడం పట్ల స్పందించాలని కోరిన మహిళా విలేకరిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే బయటకు వెళ్లిపోమ్మంటూ మండిపడ్డారు. ట్రంప్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


