ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు హర్మూజ్ జలసంధి వైపే. హర్మూజ్ జలసంధిని తెరవడం.. కీలక నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పలు దేశాలు నడుంబిగించిన వేళ.. మళ్లీ హర్మూజ్ జలసంధి మూతపడింది. నిన్న(శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) హర్మూజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్.. రోజు వ్యవధిలోనే దాన్ని మళ్లీ మూసేసింది.
అమెరికా వైఖరి కారణంగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గంటకో మాట మాట్లాడుతున్న తరుణంలో అసలు ఏం జరుగుతుందో ఇరాన్‌కు అంతు చిక్కడం లేదు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఆపై మరి కాసేపటికి హర్మూజ్ జలసంధిని తాము మూసివేస్తున్నామని ప్రకటించారు ట్రంప్. దాంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నడుమ ట్రంప్ మాటల్లో స్పష్టత లేదని అభిప్రాయానికి వచ్చేసింది ఇరాన్. అంతే హర్మూజ్ జలసంధిని తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసింది.
నిన్న ఏం జరిగిందంటే..
నిన్న శుక్రవారం ప్రపంచదేశాలకు ఇరాన్ శుభవార్త చెప్పింది. దాదాపు నెలరోజులకు పైగా పర్షియన్ గల్ఫ్ జలాల మీదుగా పయనిస్తే నౌకలను తగలబెడతామనే ఇంతకాలం హెచ్చరికలు జారీ చేసిన టెహ్రాన్ ఎట్టకేలకు బెదిరింపులకు స్వస్థి పలికి ఇకపై అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతినిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు ఉపిరి పీల్చుకున్నాయి.
హర్మూజ్‌పై ఇరాన్ ప్రకటనతో నిన్న స్టాక్‌మార్కెట్లకు ఊపందుకున్నాయి. అమెరికా స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడవగా ముడిచమురు నేలచూపులు చూసింది. దీనికి కారణం హర్మూజ్‌కు ఇరాన్ విముక్తి కలిగించడమే అయితే ట్రంప్ చేష్టలతో ఇరాన్‌కు మరోసారి నమ్మకం చల్లగిల్లింది.
ట్రంప్ కామెంట్స్
ట్రంప్ మాట్లాడుతూ "ఇరాన్ అన్నింటికీ అంగీకరించింది ‘‘ అణు కార్యక్రమాన్ని ఇరాన్ నిలపివేస్తుంది. తన “న్యూక్లియర్ డస్ట్” (అధికంగా శుద్ధి చేసిన యురేనియం) అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు మాత్రం వెనక్కి ఇవ్వబోం. త్వరలో శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఒప్పందం కుదిరితే ఉచిత చమురు, హర్ముజ్ ద్వారా స్వేచ్ఛా రవాణా.. అన్నీ బాగుంటాయి" అని వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సీరియస్
దీనిపై ఇరాన్ సైతం ఘాటుగా స్పందించింది. ట్రంప్ తన ఇష్టానుసారం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అమెరికా దిగ్బంధం కొనసాగితే.. హర్ముజ్‌ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ స్టేట్ మీడియా టీవీ చానెల్‌లో మాట్లాడుతూ.. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ నుంచి ఎక్కడికీ తరలించబడదు. కొనసాగుతున్న చర్చల్లో ఇది ఒక ఎర్ర గీత (red line)గా మారింది అని అన్నారు.
ట్రంప్ ద్వంద్వ వైఖరి
ఇలా ఒకవైపు చర్చలు అంటూనే ట్రంప్ ద్వంద్వ వైఖరి ప్రకటించారు. హర్మూజ్‌ను ఇరాన్ తెరిచిన దానికి ధన్యవాదాలు తెలిపిన ట్రంప్.. కాసేపటికి దాన్ని తాము మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హర్మూజ్ జలసంధి ఇక తమది అనే సంకేతాలిచ్చిన ట్రంప్.. ఇరాన్‌ను మళ్లీ బెదిరించే యత్నం చేశారు.
కథ మళ్లీ మొదటికి
ఈ పరిస్థితుల నడుమ హర్మూజ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఒకవైపు శాంతి చర్చలు అంటూ ఇరాన్‌ను బెదిరించే యత్నాలు చేశారు ట్రంప్. హర్మూజ్ తమది అనడంతోపాటు అణుకార్యక్రమాన్ని ఇరాన్ నిలిపివేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనిపై చిర్రెత్తుకొచ్చిన ఇరాన్,.. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. దాంతో హర్మూజ్ కథ రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్లీ హర్మూజ్‌ను ఇరాన్ మూసేయడంతో ఇది ఎటువైపు పోతుందో అనే చర్చ మొదలైంది.


