అమెరికా తన మిత్రదేశం భారత్‌కు షాకిచ్చింది. రష్యా, ఇరాన్ చమురుపై ఇప్పటివరకు ఇచ్చిన ఆంక్షల మినహాయింపును రద్దు చేసింది. ఈ ప్రభావం భారత్‌కు లభిస్తున్న తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడే అవకాశం కనిపిస్తోంది.
ఆ రెండు దేశాల నుంచి మార్చి 11కి ముందు లోడ్ చేసిన చమురు సరఫరాకు మాత్రమే అమెరికా భారత్ సహా కొన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చింది. అయితే ఆ స్టాక్ ఇప్పుడు పూర్తయింది. ఇకపై రష్యా, ఇరాన్ చమురు కొనుగోలు చేసే దేశాలు(భారత్ సహా) సెకండరీ సాంక్షన్స్(ద్వితీయ శ్రేణి ఆంక్షలు) ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది భారత్‌కు ఒక ఎనర్జీ షాక్ లాంటిదే.
ఇప్పటివరకు రష్యా నుండి తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి భారత్ తన ఇంధన ఖర్చులను తగ్గించుకుంది. అమెరికా ఆంక్షల మినహాయింపు రద్దు చేయడంతో ఆ సరఫరా తగ్గిపోవచ్చు. దీని వల్ల దేశీయ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
భారత్ ప్రస్తుతం రష్యా నుండి భారీగా డిస్కౌంట్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది గణాంకాల ప్రకారం.. రోజుకు సుమారు 2.08 మిలియన్ బ్యారెల్స్ వరకు చేరింది. అయితే కొన్నినెలలపాటు రష్యా నుండి దిగుమతులు తగ్గినా.. డిస్కౌంట్ ధరలు కారణంగా మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది మార్చిలో భారత్ రష్యా నుండి 5.3 బిలియన్ యూరోల విలువైన(47,700 కోట్ల రూపాయల) క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి మాత్రం 7 సంవత్సరాల తర్వాత 2026లో మొదటిసారి సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసింది.
తాజా పరిణామాల దృష్ట్యా భారత్ తన ఎనర్జీ పాలసీని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. విభిన్న సరఫరా మార్గాలు (పశ్చిమాసియా.. గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా) అన్వేషించుకోవాల్సి ఉంటుందని.. దీర్ఘకాలంలో పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టడం తప్పనిసరి అవుతుందని చెబుతున్నారు.
హర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు రవాణా మార్గాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయి. అమెరికా "మాక్సిమమ్ ప్రెషర్" విధానాన్ని మళ్లీ అమలు చేస్తూ, ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం ప్రపంచ చమురు ధరలపై కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు..
అమెరికా ఇరాన్ ఆయిల్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌పై కొత్త ఆంక్షలు విధించింది. సుమారు రెండు డజన్ల కంపెనీలు, వ్యక్తులు, నౌకలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో కొందరు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ సలహాదారుడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని సమాచారం.


