ఇరాన్‌కు రష్యా అండ.. యుద్ధంలో బిగ్ ట్విస్ట్? | How The Russia-Iran Alliance Is Reshaping Global Geopolitics, Putin Assures Iran Of Full Backing | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు రష్యా అండ.. యుద్ధంలో బిగ్ ట్విస్ట్?

Apr 28 2026 9:46 AM | Updated on Apr 28 2026 10:12 AM

How the Russia-Iran Alliance is Reshaping Global Geopolitics

మాస్కో: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ రష్యా-ఇరాన్ దేశాల మధ్య బలపడుతున్న మైత్రి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నరాలు తెగే ఉత్కంఠను రేపుతోంది. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమికి సవాలు విసురుతూ, ఈ రెండు దేశాల మధ్య బలపడుతున్న బంధం  మరింత ఉత్కంఠ రేపుతోంది. కేవలం దౌత్యపరమైన మద్దతుకే పరిమితం కాకుండా, ఒకరి రక్షణ అవసరాలను మరొకరు తీర్చుకుంటూ కొనసాగుతున్న ఈ దోస్తీ.. ఇరాన్ వెనుక ఒక అగ్రరాజ్యం అండగా నిలబడిందనే సంకేతాన్ని స్పష్టంగా పంపుతోంది.

ఈ విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చేపట్టిన దౌత్య పర్యటనలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాకిస్తాన్, ఒమన్‌ దేశాల్లో పర్యటన ముగించుకుని ఆయన నేరుగా మాస్కో చేరుకోవడం వెనుక భారీ యుద్ధ వ్యూహం దాగి ఉందన్నది బహిరంగ రహస్యం. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో జరగబోయే భేటీలో ప్రాంతీయ భద్రతతో పాటు కీలకమైన రక్షణ ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి. రష్యాతో కలిసి దౌత్యపరమైన వ్యూహాలను ఖరారు చేయడం ద్వారా, అటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ముప్పును, ఇటు అంతర్జాతీయ స్థాయిలో పాశ్చాత్య దేశాల ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని టెహ్రాన్ భావిస్తోంది.

ఈ పరిణామాలన్నింటినీ మలుపు తిప్పుతూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్‌కు ఇచ్చిన హామీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అబ్బాస్ అరాఘ్చీతో జరిగిన అత్యంత కీలక భేటీలో పుతిన్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రయోజనాలను కాపాడేందుకు మాస్కో తన సర్వశక్తులూ ఒడ్డుతుందని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించేందుకు ఇరాన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఇరాన్ ప్రజలు ప్రస్తుత కష్టకాలాన్ని ధైర్యంగా అధిగమిస్తారని ఆయన భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ పరిణామాలపై రెండు దేశాలు నిరంతరం సన్నిహితంగా చర్చలు జరుపుతాయని, ఈ వ్యూహాత్మక సహకారం భవిష్యత్తులోనూ అప్రతిహతంగా కొనసాగుతుందని పుతిన్ ప్రకటించడం ఈ దోస్తీ ఎంతటి బలమైనదో చాటిచెబుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement