గ్రహాంతర జీవులున్నారు! | Former Israeli space security chief says aliens exist | Sakshi
Sakshi News home page

గ్రహాంతర జీవులున్నారు!

Dec 10 2020 5:54 AM | Updated on Dec 10 2020 9:46 AM

Former Israeli space security chief says aliens exist - Sakshi

టెల్‌అవీవ్‌: విశ్వంలోని ఇతర గ్రహాల్లో జీవులున్నారని, ఏలియన్స్‌ ఉన్నారన్న సంగతి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు సైతం తెలుసని ఇజ్రాయెల్‌ స్పేస్‌ సెక్యూరిటీ మాజీ చీఫ్‌ హైమ్‌ యేషెడ్‌ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్‌ తమ ఉనికిని రహస్యంగా ఉంచుతున్నారని, మానవాళి గ్రహాంతర జీవులను నమ్మేందుకు ఇంకా తయారుగా లేనందునే వారు రహస్యంగా ఉంటున్నారని యేషెడ్‌ చెప్పారు. గ్రహాంతర జీవులు, వారితో అమెరికా ప్రభుత్వ ఒప్పందం, ఏలియన్స్‌ ఏర్పాటు చేసిన గెలాక్టిక్‌ ఫౌండేషన్‌ తదితర అంశాలను 87 ఏళ్ల యేషెడ్‌ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన కీలక పదవిలో ఉండడంతో యేషెడ్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత వస్తోంది.

విశ్వ నిర్మాణాన్ని అధ్యయనం చేయాలని ఏలియన్స్‌ భావిస్తున్నారని, ఆ మేరకు యూఎస్‌ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారని యేషెడ్‌ చెప్పారు. దీంతో పాటు మార్స్‌ గ్రహంపై ఒక రహస్య అండర్‌గ్రౌండ్‌ బేస్‌ నిర్మాణానికి సైతం అమెరికా, ఏలియన్స్‌ మధ్య ఒప్పందం ఉందన్నారు. గెలాక్టిక్‌ ఫౌండేషన్‌ సూచన మేరకు ఏలియన్స్‌ ఉన్నారన్న నిజం తెలిసినా ట్రంప్‌ బయటకు చెప్పట్లేదన్నారు. మానవాళి విశ్వం, విశ్వ నౌకల గురించి అవగాహన పెంచుకోవాలని గ్రహాంతర జీవుల కోరికని చెప్పారు. ఐదేళ్ల క్రితం తానీ విషయం చెబితే తనపై పిచ్చోడి ముద్ర వేసి ఆస్పత్రిలో చేర్చేవారని యేషెడ్‌ అన్నారు. గతంలో ఆయన రచించిన ఒక పుస్తకంలో కూడా యేషెడ్‌ ఇలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చారు. తాజాగా యేషెడ్‌ చేసిన కామెంట్లపై ట్రంప్‌ కానీ, యూఎస్‌ ప్రభుత్వం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement