ఇండోనేషియాలో భూకంపం 8 మంది మృతి

మలాంగ్: ఇండోనేషియాలోని జావా దీవిలో భారీ భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 7 గంటలకు (స్థానిక కాలమానం), 6.0 పరిణామంతో సంభవించిన ఈ భూకంపం కారణంగా 8 మంది మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు చెప్పారు. మలాంగ్ జిల్లాలకు 45 కిలోమీటర్ల దూరంలో 82 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే దీని కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని ఇండోనేషియా ఎర్త్‌క్వేక్ అండ్ సునామీ సెంటర్ రహ్మద్ త్రియోనో స్పష్టం చేశారు.
భూకంపం కారణంగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలకు దగ్గరగా ఉండవద్దని, అవి విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భూకంపం సమయంలో ప్రజలంతా భయపడుతూ భవనాల నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తున్న దృశ్యాలు అక్కడి టీవీల్లో కనిపించాయి. లుమజాంగ్ జిల్లాలో బైక్‌పై వెళుతున్న మహిళపై కొండ చరియలు విరిగిపడటంతో ఆమె మరణించింది. మరికొన్ని చోట్ల భవనాల కింద మరణించిన వారి శరీరాలను బయటకు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.
చదవండి: మరోసారి మయన్మార్ సైన్యం కాల్పులు, 82 మంది మృతి!
సంబంధిత వార్తలు