Afghanistan- Panjshir: పంజ్‌షీర్‌లో హోరాహోరీ

700 Taliban killed in Afghanistans Panjshir, claim resistance forces - Sakshi

700 మందికిపైగా తాలిబన్లు మృతి?

తమదే పై చేయి అని ప్రకటించుకున్న ఇరుపక్షాలు

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో తమ స్వాదీనంలో లేని ఒకే ఒక్క ప్రావిన్స్‌ పంజ్‌షీర్‌ను ఎలాగైనా తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలతో ఆ లోయలో హోరాహోరీ పోరాటం జరుగుతోంది. తాలిబన్లు, వారిని గట్టిగా ప్రతిఘటిస్తున్న నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌ఏ) ఎవరికి వారే తమదే పై చేయిగా ఉందని చెప్పుకుంటున్నారు. ఖవాక్‌ మార్గం వద్ద వందలాది మంది తాలిబన్లతో జరిగిన పోరులో 700 మందికిపైగా తాలిబన్లు మరణించారని, మరో 600 మందిని నిర్బంధించి జైళ్లలో ఉంచామని ఎన్‌ఆర్‌ఎఫ్‌ఏ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది.

మరోవైపు తాలిబన్లు పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ బజారక్‌లోకి ప్రవేశించి గవర్నర్‌ కార్యాలయాన్ని చుట్టుముట్టినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ అదంతా ఉత్తదేనని తేలింది. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌లో ఉన్న ఏడు జిల్లాలకు గాను నాలుగు జిల్లాలైన షూతల్, అనాబా, ఖింజ్, ఉనాబాలపై పట్టు సాధించామని తాలిబన్‌ అధికార ప్రతినిధి బిలాల్‌ కరిమి వెల్లడించినట్టుగా అస్వాకా న్యూస్‌ ఏజెన్సీ కథనాన్ని ప్రచురించింది.  

మానవీయ సంక్షోభాన్ని నివారించండి: యూఎన్‌కు సలేహ్‌ లేఖ
పంజ్‌షీర్‌ లోయపై తాలిబన్లు భీకరంగా దాడి చేస్తున్నారని, ఈ లోయలో మానవీయ సంక్షోభం ముంచుకొస్తుందని అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల దాడుల్ని అడ్డుకొని మానవీయ సంక్షోభం నుంచి లోయని కాపాడాలంటూ ఆయన ఐక్యరాజ్యసమితి(యూఎన్‌)కి ఒక లేఖ రాశారు. తమ లోయకి తాలిబన్లు కమ్యూనికేషన్లని కట్‌ చేశారని, ఆర్థికంగా కూడా దిగ్బంధిస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం తాలిబన్ల దాడిని అడ్డుకొని చర్చల ద్వారా ఒక రాజకీయ పరిష్కారానికి కృషి చెయ్యాల్సిన అవసరం ఉందని సలేహ్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

చర్చలకు సిద్ధం: మసూద్‌
తాలిబన్లు పంజ్‌షీర్, అంద్రాబ్‌ల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటే వారితో చర్చలకు సిద్ధమని ఎన్‌ఆర్‌ఎఫ్‌ఏ నాయకుడు అహ్మద్‌ మసూద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘శాంతియుతంగా తాలిబన్లతో విభేదాలను పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నాం. వివిధ గ్రూపులు, తెగలతో సమ్మిళిత అధికార వ్యవస్థ నెలకొంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.

దేశీయ విమానాలు షురూ...
కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం నుంచి పరిమిత సంఖ్యలో దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. జాతీయ విమానసంస్థ అరియానా అఫ్గాన్‌ ఎయిర్‌లైన్స్‌హెరాత్, కాందహార్, బాల్ఖ్‌లకు విమానాలను నడిపింది.  రాడార్‌ వ్యవస్థ లేనందువల్ల పగటి పూట మాత్రమే విమానాలు నడుస్తున్నాయి. కాబూల్‌ విమానాశ్రయం పునరుద్ధరణకు ఖతార్, టర్కీ  బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సేవల పునరుద్ధరణ  మానవతా సాయానికి వీలుకలి్పస్తుందని యూఎన్‌ పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top