హన్మకొండ కల్చరల్: వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే 17వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు–2026 కరపత్రాన్ని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్, ఐక్యవేదిక పరపతి సంఘం సభ్యుల సహకారంతో ఈ నెల 12, 13, 14వ తేదీల్లో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనున్నారు. కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో రంగస్థల కళాకా రుల ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య, తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, నాగపురి సంజయ్‌బాబు, గూడూరు బాలాజీ పాల్గొన్నారు.


