ప్రైవేటు బడి.. నిలువు దోపిడీ! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బడి.. నిలువు దోపిడీ!

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

ప్రైవేటు బడి.. నిలువు దోపిడీ! ● ఇది ఒక్క శ్రీరామ్‌కే పరిమితమైన సమస్య కాదు. ఫీజుల భారంతో నలిగిపోతున్న మధ్యతరగతి కుటుంబాలు పిల్లల చదువుల కోసం రూ.వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.

ఒకటో తరగతికే రూ. వేలల్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు క్యాంపస్‌లలోనే పుస్తకాలు, యూనిఫాం అమ్మకాలు ప్రైవేటు స్టడీ మెటీరియల్‌ బలవంతంగా అంటగడుతున్న యాజమాన్యాలు వారి దోపిడీకి నలిగిపోతున్న పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు యాజమాన్యాల ధనదాహంతో అప్పులపాలు టీడీపీ పాలనలో విద్యాసంస్థలపై కనీస నియంత్రణ కరువు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఫీజుల నియంత్రణ చర్యలు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల కొనుగోలు తప్పనిసరి చేసిన వైఎస్‌ జగన్‌

నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయం

గుంటూరు ఎడ్యుకేషన్‌ :‘‘గుంటూరు నగరంలోని కొరిటెపాడుకు చెందిన శ్రీరామ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలను సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. ఒకటో తరగతిలో చేర్పించిన బాబుకు రూ.22 వేల ఫీజుతోపాటు పుస్తకాలు, యూనిఫాం కోసం అదనంగా రూ.4,500 వేలు చెల్లించాలని స్కూల్లో చెప్పారు. అదే విధంగా రెండో తరగతిలో చేర్పించిన కుమార్తెకు ఫీజు రూపంలో రూ.24 వేలతోపాటు పుస్తకాలు, యూనిఫాం కోసం రూ.6 వేలు చెల్లించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల వెల ఒక్కో విద్యార్థికీ రూ.500 లోపే కదా అని అడిగితే ప్రభుత్వ పుస్తకాలను మార్కెట్లో కొనుక్కోవాలని, తాము సూచించిన పుస్తకాలను క్యాంపస్‌లోనే కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం దబాయించింది. ఫలితంగా చిరుద్యోగం చేస్తూ నెలకు రూ.18 వేలు సంపాదిస్తున్న శ్రీరామ్‌ ఇద్దరు పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించడం పెనుభారంగా మారింది. వచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని పోషించడంతోపాటు పిల్లలను ఏ విధంగా చదివించాలని ఆవేదన చెందుతున్నారు.’’

చంద్రబాబు పాలనలో పట్టించుకునే దిక్కేది?

టీడీపీ పాలనలో ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలపై నియంత్రణ కరువైన ఫలితంగా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల దోపిడీతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. గతేడాదితో పోల్చితే ఫీజులను 20 శాతం నుంచి 30 శాతం మేరకు అడ్డగోలుగా పెంచేశారు. ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతికి ఫీజు రూ.20 నుంచి రూ.22 వేల మధ్యలో ఉంది. కార్పొరేట్‌ స్కూల్లో అది రూ.30 వేలు చేశారు. కార్పొరేట్‌ పాఠశాలలో 6వ తరగతికి రూ.40 వేల నుంచి రూ.45 వేలు, పదో తరగతికి రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్న పాఠశాలలు ఉన్నాయి. అదే విధంగా 6వ తరగతి నుంచి ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌ పేరుతో నిర్వహిస్తున్న వివిధ ప్రోగ్రామ్‌లకు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 60 వేల మొదలు రూ.లక్ష వరకూ వసూలు చేస్తున్నారు. ఏసీ క్యాంపస్‌లతో కూడిన పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.60 వేలు, టెన్త్‌కు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు.

నాణ్యమైన విద్య అందని పరిస్థితులు

ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన పాఠ్యాంశాల బోధనకు బదులుగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు అనధికార పాఠ్యపుస్తకాలతో తరగతులను నిర్వహిస్తున్నారు. గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా రూపొందించి, ముద్రించిన పాఠ్య పుస్తకాలనే బోధించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు తమ వద్ద లేవని, వాటిని బహిరంగ మార్కెట్లో కొనుక్కోవాలని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధన చేస్తున్న పాఠ్యాంశాలనే ప్రైవేటు విద్యార్థులకూ తప్పనిసరి చేస్తూ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయానికి చంద్రబాబు సర్కార్‌ తూట్లు పొడించింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 637 ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ఉన్నాయి. సొంత సిలబస్‌ బోధించి, పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

పత్తా లేని యాజమాన్య కమిటీలు

ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచేందుకు నిబంధనలు అంగీకరించవు. పాఠశాల యాజమాన్య కమిటీ ఆయా విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి, బడిలో కల్పిస్తున్న సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. గత విద్యాసంవత్సరంలో వసూలు చేసిన ఫీజులకు ఐదు శాతమే పెంచాల్సి ఉంది. కానీ ఇవేమీ అమలు కావడం లేదు.

విద్యార్థుల నుంచి ఫీజులు మొదలు ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను క్యాంపస్‌లలోనే దుకాణం తెరిచి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను పక్కనపెట్టి, ప్రైవేటు పబ్లిషర్లతో డీల్‌ కుదర్చుకుని పాఠ్య పుస్తకాలు, నోటుబుక్‌లు విక్రయిస్తున్నారు. ఈ విధంగా ఒక్కో విద్యార్థికి విక్రయిస్తున్న పుస్తకాల ధరలో కనీసం 50 శాతం మేరకు లాభాలను ఆర్జిస్తున్నారు. వివిధ పాఠశాలలు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు యూనిఫాం, బెల్టు, టై సహా అన్ని రకాల సామగ్రిని క్యాంపస్‌లలోనే విక్రయిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలలు మార్కెట్లోని వస్త్ర విక్రయ దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకుని దండుకుంటున్నాయి. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement