జాగ్రత్తగా లేకపోతే ఓటు కోల్పోయే ప్రమాదం 24 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ రేపటి నుంచి ఇంటింటికీ బూత్ లెవల్ అధికారులు 2002 ఓటరు జాబితా ఆధారంగా ఓటర్ల వివరాలు పరిశీలన
‘సర్’కు ప్రతి ఒక్కరూ సహకరించాలి
నెహ్రూనగర్: ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)’పై అందరిలోనూ ఆందోళన నెలకొంది. సర్వేలో భాగంగా బీఎల్‌ఓలు ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫారం–2ను ఓటరు నింపి మళ్లీ అందజేయాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వివరాలతో పాటు తన కుటుంబం 23 ఏళ్లగా భారతదేశంలోనే ఉన్నట్టు ధ్రువీకరించే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ఓట్లను టార్గెట్ చేసి ‘23 ఏళ్ల నివాసం’ పేరుతో భారీగా ఓట్లు గల్లంతు చేస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతోపాటు ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే పెద్ద మొత్తంలో ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. అందుకే జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన ‘సర్’ హాట్ టాపిక్‌గా మారింది. ‘సర్’ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం పలు అనుమానాలు నెలకొన్నాయి.
2002 తర్వాత మళ్లీ ఇప్పుడు...
గుంటూరు జిల్లాలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాలతో కలిపి మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో పురుషులు 8,69,950 మంది, మహిళలు 9,31,668, ట్రాన్స్‌జెండర్స్ 165, మొత్తం 18,01783 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 2002లో చివరిసారిగా ‘సర్’ ప్రక్రియ చేపట్టారు. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీఎల్‌ఓలు 2002 ఓటరు జాబితా ప్రాతిపదికన ప్రస్తుత ఓటరు జాబితాను పరిశీలిస్తారు. ఈ నెల 15 (సోమవారం) నుంచి జూలై 14 వరకూ బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారు. సర్వే వివరాల ఆధారంగానే ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా ప్రకటిస్తారు.
ఫారం–2లో ఏం నింపాలి..
‘సర్’ కార్యక్రమంలో ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారం–2 నింపి, బీఎల్‌ఓకు అందజేయాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులకు ఈ ప్రక్రియ అంత సులువు కాదు. 2002 నాటి ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. ఆ వివరాలు ఎన్యుమరేషన్ ఫారంలో నింపాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే.. మీ తల్లిదండ్రులు లేదా భార్య/భర్త లేదంటే ఇతర కుటుంబికుల పేరు ఉంటే వారి వివరాలు నమోదు చేయాలి. వీటితోపాటు పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్, తండ్రి / సంరక్షకుడి పేరు, తల్లి పేరు, భార్య / భర్త పేరు, వారి ఎపిక్ నంబర్ (అందుబాటులో ఉంటే) తదితర వివరాలు నింపి, కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అతికించి బీఎల్‌ఓకు అందజేస్తే ఇందుకు రశీదు ఇస్తారు. దీన్ని తప్పనిసరిగా భద్రపరచుకోవాలి.
‘సర్’లో ముఖ్యమైన తేదీలు
బూత్ లెవల్ ఏజెంట్లదే కీలక పాత్ర..
సర్ విషయంలో రాజకీయ పార్టీలు, వారి పార్టీల బీఎల్‌ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) అప్రమత్తంగా ఉండాలి. తమ బూత్ పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు. ఎంత మంది ఓట్లు మ్యాపింగ్ అయ్యాయి.. ఎంత మందివి మ్యాపింగ్ కాలేదు... అనే వివరాలు తెలుసుకుని ఉండాలి. మ్యాపింగ్ కాని ఓటర్ల వద్దకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండేలా చూడాలి. బీఎల్‌ఓ వచ్చినపుడు వివరాలను సమర్పించేలా చూసి మ్యాపింగ్ చేయించాలి. 2002 ఓటరు జాబితాలో ఓటరుగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఆ ఇంటిలో లేకపోతే.. ఇంటిలో ఉన్న ఓటరు తాలూకా బంధువుల నుంచి వివరాలు ఇప్పించి మ్యాపింగ్ చేయించాలి. ఈ విషయంలో తప్పులు దొర్లితే ఓట్లు గల్లంతు అయ్యే ప్రమాదం లేకపోలేదు.
ఈ నెల 15 నుంచి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వచ్చి ఓటరు వివరాల సర్వే చేస్తారు. వారు అప్పుడు అడిగే ఎపిక్ కార్డు (ఓటరు గుర్తింపు కార్డు), రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, 2002 ఓటరు జాబితా వివరాలు, తల్లిదండ్రులు లేదా తాతల ఎపిక్ కార్డులు ప్రజలు సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తారు. ఒకటి నింపి వారికిచ్చి, మరొకటి రశీదుగా తీసుకోవాల్సి ఉంటుంది. పారదర్శక ఓటరు జాబితా కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– కె.మయూర్ అశోక్, జీఎంసీ కమిషనర్


