దర్జాగా బళ్లబాట కబ్జా | - | Sakshi
Sakshi News home page

దర్జాగా బళ్లబాట కబ్జా

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

● ఈ సమస్యపై చేబ్రోలు గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్‌ను ఆశ్రయించినా ఫలితం శూన్యమని వాపోతున్నారు. పైపెచ్చు అధికారపార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోిపిస్తున్నారు.

బళ్లబాట కబ్జాచేసి ప్లాస్టిక్‌ కంపెనీ నిర్మాణం పంటపొలాలకు చేరుకునేందుకు రైతులకు తీవ్ర ఇబ్బందులు చేతనైంది చేసుకోండి అంటూ అధికారపార్టీ ముఖ్యనేత అనుచరుడి బెదిరింపులు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో బీడు బీములుగా మారనున్న పంట పొలాలు

చేబ్రోలు: చేబ్రోలు గ్రామంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సాంప్రదాయ ‘బళ్ల బాట’ మూసివేతపై స్థానిక రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన చేబ్రోలు గ్రామ పరిధిలోని కొమ్మమూరు బ్రిడ్జి సమీపంలో జీబీసీ రహదారి పక్కన సర్వే నెంబర్‌ 963–1బి లో 1.66 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన అధికార పార్టీ పొన్నూరు నియోజకవర్గ ముఖ్యనేత అనుచరుడు పరుచూరి సత్య కిషోర్‌ ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ పరిశ్రమను కొంతకాలం క్రితం నిర్మించాడు. వ్యవసాయ భూమిలో నిర్మాణాలు చేపట్టే సమయంలో బళ్లదారికి ఇరువైపులా ఉన్న రైతులందరితో సదరు యజమాని అనుకూలంగా మాట్లాడాడు. ప్రధాన రహదారి రోడ్డు నుంచి రైతులకు అనుకూలంగా ‘బళ్ల బాట’ (రైతుల రాకపోకలకు దారి) వదులుతానని నమ్మబలికాడు. అయితే కంపెనీ నిర్మాణం పూర్తయిన తర్వాత మాట మార్చడమే కాకుండా, ప్రస్తుతం రైతులకు ఉన్న ఏకై క దారిని సైతం మూసివేస్తూ అక్కడ శాశ్వత రక్షణ గోడను నిర్మించారు. దీనిపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేయగా, ‘నేను దారి ఇచ్చేది లేదు, మీకు చేతనైంది చేసుకోండి, నాకు అన్ని అనుమతులు ఉన్నాయి’ అంటూ సదరు అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

600 ఎకరాలపై ప్రభావం..

రైతుల పంట పొలాలకు ట్రాక్టర్లు, పంట ఉత్పత్తులు తరలించటానికి రాకపోకలకు ఉపయోగించే బళ్ల బాట మూసుకుపోవడం వల్ల దాదాపు 600 వందల ఎకరాలకు పైగా ఉన్న పంట పొలాలకు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. పొలాల్లో పండిన పంటను ఇంటికి లేదా మార్కెట్‌కు తరలించడానికి, వ్యవసాయ సామగ్రిని పొలాల్లోకి తీసుకెళ్లడానికి ఈ దారి తప్ప రైతులకు ప్రత్యామ్నాయ మార్గం లేదు. కంపెనీ యాజమాన్యం నిర్మాణ పనులను వేగవంతం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. తూర్పు వైపు ప్రహారీ నిర్మాణం, ఉత్తరం వైపున ప్రహరీ నిర్మాణాలను కొంత భూమి బళ్లబాట కోసం రైతులకు ఉపయోగపడే విధంగా వదలకుండా పనులు పూర్తి చేస్తుండటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ముప్పు

మాగాణి భూమిలో నిర్మాణం జరిగిన ప్లాస్టిక్‌ బకెట్లు, వస్తువుల తయారీ కంపెనీ వలన చుట్టుపక్కల భూములకు ముప్పు ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్లాస్టిక్‌ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల భవిష్యత్తులో చుట్టుపక్కల భూములన్నీ బీడు భూములుగా మారే ప్రమాదం పొంచి ఉందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బళ్లబాట సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, అక్కడ న్యాయం జరగకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా కంపెనీ ముందు భాగంలో ఉన్న సాగునీటి కాలువ పూడ్చివేతపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిమెంటు తూము వేసి పరిశ్రమలోకి రాకపోకలు చేస్తున్నారు. కాలువలోకి గ్రావెల్‌ జారిపోవటంతో కాలువ పూడిపోయింది. సిమెంటు తూమును తీసివేసి వంతెన కల్వర్టు నిర్మాణం చేసుకోవాలని రైతులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement