గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా గుంటూరు కొరిటెపాడులోని ఆర్‌సీఎం పాఠశాలలో విద్యార్థినులు చీపుర్లు పట్టుకుని పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసిన సంఘటనపై ‘చిట్టి తల్లులకు చీపురు కష్టాలు’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురించిన వార్తకు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జరిగిన సంఘటనపై ఎంఈవోతో విచారణ జరిపించామని, పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండా విద్యార్థినులు పాఠశాలను పరిశుభ్రం చేశారని తెలిపారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయునికి సంజాయిషీ నోటీసు జారీ చేశామని పేర్కొన్నారు. మరోసారి ఇటువంటి తప్పిదం జరగకుండా చూడాలని ఆదేశించామని చెప్పారు. జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులతో ఎటువంటి పనులు చేయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
4,040 సీట్లకు కౌన్సెలింగ్
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో 2026–27 విద్యాసంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ వర్గాలు శనివారం విడుదల చేశాయి. ప్రత్యేక కేటగిరీ కోటా మినహా 4,040 సీట్లకు ఎంపికై న విద్యార్థుల జాబితాను తాజాగా విడుదల చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 366 మంది ఎంపికవ్వగా, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అత్యల్పంగా నలుగురు ఎంపికయ్యారు. పల్నాడు జిల్లా నుంచి 188 మంది ఎంపికవగా, బాపట్ల జిల్లా నుంచి 120, గుంటూరు జిల్లా నుంచి 79 మంది ఎంపికయ్యారు. బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థిని భవిరెడ్డి దివ్యతేజశ్రీ టాప్ టెన్‌లో చోటు దక్కించుకుంది. టాప్ 10 జాబితాలో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 517.30 అడుగులకు చేరింది. కుడికాలువకు 3,031, ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది.


