మంగళగిరి టౌన్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం యోగాతోనే సాధ్యమని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణం శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహర్షి పతంజలి చిత్రపటానికి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, యోగా సాధన పట్ల ఆసక్తిని కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, ఆరోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలకపాత్ర వహిస్తుందని అన్నారు. ప్రతిరోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయించాలని కోరారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా, డీఎంహెచ్‌ఓ శాఖ అధికారులు, యోగా శిక్షకులు, సాధకులు, మహిళ, యువత తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ


