2004 ఎన్నికల ముందు కేసుల సంగతేంటి? | - | Sakshi
Sakshi News home page

2004 ఎన్నికల ముందు కేసుల సంగతేంటి?

Jun 14 2026 7:04 AM | Updated on Jun 14 2026 7:04 AM

2004 ఎన్నికల ముందు కేసుల సంగతేంటి?

గత ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌తో ఇప్పించిన హామీలు అమలు ఏదీ! పోలింగ్‌ రోజున ఇష్యూ నిజమే జనసేనకు పనిచేసిన వ్యక్తి అసభ్యంగా దూషించినందునే ఇష్యూ మంత్రి నాదెండ్ల మనోహర్‌పై మాజీ ఎమ్మెల్యే శివకుమార్‌ ధ్వజం

తెనాలి: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీ తెనాలిలో భారీగా విజయవంతం కావటంతో బెంబేలెత్తిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ విలేకరుల సమావేశంలో తనను అహంకారిగా వ్యాఖ్యనించటాన్ని వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఖండించారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో పార్టీ నేతలతో కలిసి శివకుమార్‌ మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉంటున్న తెనాలికి చెందిన వ్యక్తి ఎన్నికలకు ముందుగానే ఇక్కడకు వచ్చి జనసేన/టీడీపీకి ప్రచారం చేశారని చెప్పారు. పోలింగ్‌ సమయంలో తనను అసభ్యంగా మాట్లాడటంతో ఇష్యూ జరిగిందని చెబుతూ ‘అదంతా నీవల్లే జరిగింది... ఆర్గనైజ్డ్‌గా చేయించావు’ అని మనోహర్‌ను ఉద్దేశించి అన్నారు. అయినా తాను కేసు పెట్టలేదని గుర్తుచేశారు. అదే తన అహంకారమైతే ఎన్నికల ముందు మనోహర్‌పై ఏడు కేసులు ఉన్నాయని, అవన్నీ 2004 ఎన్నికల అఫిడవిట్‌లో ఆయనే స్వయంగా ప్రకటించినట్టు ఆ పత్రాలను చూపారు. అందులో 420తో సహా సేవాట్రస్ట్‌ ముసుగులో అసాంఘిక కార్యకలాపాల కోసం ఆడపిల్లల్ని నిర్బంధించటమనే 372–కే సెక్షన్‌ కూడా ఉందని ఆరోపించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ వాళ్లు కరపత్రాలను కూడా పంచారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గంజాయి వీధివీధినా దొరికిందన్న మనోహర్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ‘ఇప్పుడు నీ హయాంలో గంజాయితో పాటు డ్రగ్స్‌, న్యూడ్‌కాల్స్‌ సెంటర్‌ నడిచాయి’ అని చెప్పారు.

హామీలు అమలు చేయలేని మంత్రి

ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ద్వారా తెనాలి ప్రజలకు ఇప్పించిన

హామీలను మంత్రి హోదాలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ ఎందుకు అమలు చేయటం లేదని శివకుమార్‌ ప్రశ్నించారు. కొల్లిపర వద్ద కృష్ణానదిపై చెక్‌డ్యామ్‌ నిర్మిస్తామని, వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని, తెనాలిలో పంటకాలువలను లాస్‌వెగాస్‌లా సుందరీకరిస్తామని హామీలనిచ్చినట్టు నాటి వీడియోను ప్రదర్శిస్తూ చెప్పారు. అలాగే నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆరంభించి యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తామని కూడా గుర్తు చేశారు. తెనాలి– విజయవాడ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తామని మనోహర్‌ చెప్పారని వివరించారు. ఆ హామీల ప్రతిపాదనలున్నా చూపాలని డిమాండ్‌ చేశారు. తెనాలి వచ్చినప్పుడు పంటకాలువల వెంట తిరుగుతూ అధికారులు తన మాట వినటం లేదని మనోహర్‌ అనటాన్ని ఏమనాలని శివకుమార్‌ ప్రశ్నించారు. సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్‌ సీపీ హయాంలో ఎమ్మెల్యేగా తాను రూ.1800 కోట్ల సంక్షేమంతో పాటు 26 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు చెప్పారు. 170 రోడ్లు నిర్మించానని గుర్తుచేశారు. మార్కెట్‌ ధర లేనపుడు జొన్న/మొక్కజొన్న పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేశామని చెప్పే మంత్రి మనోహర్‌, గత రబీలో జొన్న, మొక్కజొన్న ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ న్యాయవాదులు చింకా సురేష్‌చంద్ర యాదవ్‌, మైలా విజయ్‌నాయుడు, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు కల్లం వెంకటప్పారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు కొడాలి క్రాంతి, పెదలంక వెంకటేశ్వర్లు, కాకి దేవసహాయం, కొర్ర యశోద, కొంగర రాగమంజరి, షేక్‌ జకీరా, ఎం.ఇందిరా ప్రియదర్శిని, సిద్దాబత్తుని శాంతి, నీలి అజయ్‌, మల్లెబోయిన రాము, యలవర్తి సాంబశివరావు, ఉన్నం అనీష్‌, పొట్లూరి అశోక్‌, పల్లె రోహిత్‌శామ్యూల్‌, పిల్లి వీరయ్య, యాతాటి అనిల్‌, కాళిదాసు సత్యం, చుక్కా ఆనంద్‌, అక్కిదాసు కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement